Share News

అదానీ గ్రూప్‌ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక పెద్ద కథ

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:32 AM

అదానీ గ్రూప్‌పై పెద్దఎత్తున ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక పుట్టుపూర్వోత్తరాలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ తవ్వి తీస్తోంది. గత ఏడాది అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల దందాపై ఈ సంస్థ...

అదానీ గ్రూప్‌ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక పెద్ద కథ

రెండు నెలల ముందే హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చేతికి నివేదిక: సెబీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై పెద్దఎత్తున ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక పుట్టుపూర్వోత్తరాలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ తవ్వి తీస్తోంది. గత ఏడాది అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల దందాపై ఈ సంస్థ విడుదల చేసిన నివేదికతో.. ఆ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 15,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.12.51 లక్షల కోట్లు) తుడిచి పెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే హిండెన్‌బర్గ్‌ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయడానికి రెండు నెలల ముందే న్యూయార్క్‌ కేంద్రంగా పని చేసే మార్క్‌ కింగ్డన్‌ అనే హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చేతికి అందించిందని సెబీ తన షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. ఈ ముందస్తు సమాచారం ఆధారంగా ఈ హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌.. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నిర్వహణలోని ఒక బ్రోకరేజీ సంస్థ ద్వారా అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈ ఎల్‌) కంపెనీ షేర్లలో ముందే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని.. నివేదిక వెలువడిన వెంటనే అమ్ముకుని లాభాలు సొమ్ము చేసుకున్నట్టు సెబీ తెలిపింది.


చైనా లింక్‌ !

మరోవైపు హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ కింగ్డన్‌ భార్య అన్లా చెంగ్‌ చైనా గూఢచారి అని గతంలో అదానీ గ్రూప్‌ తరఫున వాదించిన లాయర్‌ మహేశ్‌ జెఠ్మలానీ ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. ఈవిడ ప్రమేయంతోనే మార్క్‌ కింగ్డన్‌, హిండెన్‌బర్గ్‌ ద్వారా అదానీ గ్రూప్‌ కంపెనీలపై నివేదిక తయారు చేయించి విడుదల చేయించినట్టు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కోటక్‌ మహీంద్రా (ఇంటర్నేషనల్‌) బ్యాంక్‌ అనుబంధ బ్రోకరేజీ సంస్థ ఒక పావుగా మారిందని తెలిపింది.

Updated Date - Jul 08 , 2024 | 08:12 AM