Share News

‘ఆర్థిక’ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:30 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌లోనూ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాకర్షక పథకాల జోలికి పోకుండా ద్రవ్య లోటును కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు...

‘ఆర్థిక’ బలోపేతమే లక్ష్యం

  • ప్రజాకర్షక పథకాలకు స్వస్తి

  • ద్రవ్య లోటు కట్టడికే ప్రాధాన్యత

  • 5.1 శాతానికి తగ్గనున్న ద్రవ్య లోటు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌లోనూ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాకర్షక పథకాల జోలికి పోకుండా ద్రవ్య లోటును కట్టడి చేయడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జీడీపీలో 5.9 శాతంగా ఉంటుందని భావించిన ద్రవ్య లోటును 5.8 శాతం (సుమారు రూ.17,34,773 కోట్లు) వద్దే కట్టడి చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) దీన్ని మరింత కుదించి జీడీపీలో 5.1 శాతం (సుమారు రూ.16,85,496 కోట్లు) మించకుండా చూస్తామని ప్రకటించారు. 2026 మార్చి నాటికి ద్రవ్య లోటు జీడీపీలో 4.5 శాతం మించకుండా చూడడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.5 శాతం పెరిగి రూ.327.71 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

పదేళ్లలో ఎంతో ఎదిగాం

ప్రధాని మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో ఆర్థికంగా భారత్‌ ఎంతో ఎదిగిందని సీతారామన్‌ తెలిపారు. సంస్థాగత సంస్కరణలు, ప్రజానుకూల పథకాలు, ఉపాధి అవకాశాల పెంపుతో మన ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు వచ్చాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం కొవిడ్‌తో 5.8 శాతం క్షీణించిన జీడీపీ, ఆ మరుసటి సంవత్సరమే 9.1 శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మరో మూడేళ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మన జీడీపీ ఏడు శాతంపైనే పెరుగుతుందని తెలిపారు.

ధరల ‘సెగ’ తగ్గింది

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో భగ్గుమన్న ధరల సెగ ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆ యుద్ధం పర్యవసానంగా 8 శాతానికి పైగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 డిసెంబరులో 5.69 శాతానికి తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న సానుకూల చర్యలు ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం మన దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెద్దగా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదన్నారు.

‘టెల్కో’ల నుంచి రూ.1.2 లక్షల కోట్లు

స్పెక్ట్రమ్‌, లైసెన్స్‌ ఫీజుల రూపంలో వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీయ టెలికాం కంపెనీల నుంచి రూ.1.2 లక్షల కోట్లు అందే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేస్తున్న రూ.93,541.01 కోట్ల కంటే ఇది ఎక్కువ.

Updated Date - Feb 02 , 2024 | 03:30 AM