Share News

మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్ల సారథ్యానికి పదేళ్లు

ABN , Publish Date - Feb 04 , 2024 | 04:41 AM

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టి నేటి తో పదేళ్లు పూర్తయ్యాయి. నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సరికొత్త శిఖరాలను అధిరోహించింది....

మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్ల సారథ్యానికి పదేళ్లు

గడిచిన దశాబ్దకాలంలో 1000% వృద్ధి చెందిన కంపెనీ షేరు

వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టి నేటి తో పదేళ్లు పూర్తయ్యాయి. నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సరికొత్త శిఖరాలను అధిరోహించింది. పలు కొత్త రికార్డులను నమోదు చేసింది. గడిచిన దశాబ్దకాలం లో అమెరికన్‌ ప్రామాణిక ఈక్విటీ సూచీ ఎస్‌ అండ్‌ పీ 185 శాతం వృద్ధి చెందగా.. మైక్రోసాఫ్ట్‌ షేరు ధర మాత్రం 1,000 శాతానికి పైగా పెరిగింది. 2014 ఆరంభంలో 40 డాలర్ల స్థాయిలో ట్రేడైన కంపెనీ షేరు.. ప్రస్తుతం 411 డాలర్ల స్థాయికి చేరుకుంది. అంతేకాదు, నాదెళ్ల హయాంలోనే సంస్థ మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) తొలిసారిగా లక్ష, 2 లక్షలు, 3 లక్షల కోట్ల డాలర్ల మైలురాళ్లను అధిగమించింది. అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3.05 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన ఏకైక కంపెనీ ఇదే. అలాగే, అత్యంత విలువైన కంపెనీ కూడా. గడిచిన పదేళ్లలో మైక్రోసాఫ్ట్‌ తన షేర్‌హోల్డర్ల సంపదను 2.8 లక్షల కోట్ల డాలర్ల మేర పెంచింది. ఉదాహరణకు, నాదెళ్ల సారథ్యం చేపట్టిన సమయంలో మైక్రోసాఫ్ట్‌ షేర్లలో 10,000 డాలర్ల పెట్టుబడుల విలువ ప్రస్తుతం 1.13 లక్షల డాలర్లకు పెరిగింది.

కంపెనీకి మూడో సీఈఓ

మైక్రోసా్‌ఫ్టకు నాదెళ్ల మూడో సీఈఓ. 1975లో మైక్రోసాఫ్ట్‌ను ఏర్పాటు చేసిన బిల్‌గేట్స్‌.. 1986లో కంపెనీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేశారు. కంపెనీ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈఓ అయిన బిల్‌గేట్స్‌.. 2000 జనవరిలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీఈఓగా నియమితులైన స్టీవ్‌ బామర్‌ కంపెనీకి 14 ఏళ్లపాటు నేతృత్వం వహించారు. 2014 ఫిబ్రవరిలో కంపెనీ పగ్గాలు నాదెళ్ల చేతికొచ్చాయి. అంతకు ముందు నాదెళ్ల కంపెనీలో క్లౌడ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

క్లౌడ్‌తో కదం తొక్కించాడు..

సారథ్య బాధ్యతలు చేపట్టాక నాదెళ్ల కంపెనీ వ్యాపార వ్యూహంలో పలు మార్పులు తీసుకొచ్చారు. అప్పటివరకు మైక్రోసా్‌ఫ్టకు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రొడక్ట్స్‌ విక్రయాలు, రాయల్టీలే ప్రధాన ఆదాయ మార్గంగా ఉండేది. నాదెళ్ల తన హయాంలో విండో్‌సతో పాటు అజుర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌, కృత్రిమ మేధ (ఏఐ) సేవలపై అధిక దృష్టిసారించారు. అంతేకాదు, 2018లో సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గిట్‌ హబ్‌, 2022లో క్యాండీక్రష్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి వీడియోగేమ్స్‌ అభివృద్ధి సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను మైక్రోసా్‌ఫ్టను కొనుగోలు చేసింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జనరేటివ్‌ ఏఐ అప్లికేషన్‌ చాట్‌ జీపీటీ అభివృద్ధి సంస్థ ఓపెన్‌ ఏఐలోనూ పెట్టుబడులు పెట్టింది. చాట్‌జీపీటీని తన ఉత్పత్తుల్లో వినియోగించుకోనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించడం గడిచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

Updated Date - Feb 04 , 2024 | 04:41 AM