Share News

టెలికాం చార్జీలు పెరగాల్సిందే..

ABN , Publish Date - May 16 , 2024 | 05:13 AM

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే టెలికాం చార్జీలు చాలా తక్కువని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ అన్నారు. టెల్కోల రిటర్నుల నిష్పత్తి మెరుగుపడాలంటే...

టెలికాం చార్జీలు పెరగాల్సిందే..

ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే టెలికాం చార్జీలు చాలా తక్కువని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ అన్నారు. టెల్కోల రిటర్నుల నిష్పత్తి మెరుగుపడాలంటే చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘టెలికాం పరిశ్రమకు ప్రస్తుతం అవసరమైన రిటర్నులు చార్జీల సవరణపైనే ఆధారపడి ఉన్నాయి. టెల్కోలకిదే ఇప్పు డు ప్రధాన సమస్య. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర టెలికాం చార్జీలు అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. కంపెనీల రిటర్నుల నిష్పత్తి మెరుగుపడాలంటే చార్జీలను సవరించాల్సిందే. కంపెనీలకు ఆదాయం ఏ సాంకేతికత ద్వారా సమకూరింది అనేది సమస్య కాదు’’ అని ఎయిర్‌టెల్‌ మార్చి త్రైమాసిక ఎర్నింగ్స్‌ కాల్‌లో విఠల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ సేవల ద్వారా లభించే ఆదాయం పరిమితమే అయినప్పటికీ, మొత్తం వ్యాపారంపై ఎంత మేర రిటర్ను లభిస్తున్నదనేదే కంపెనీ చూస్తుందన్నారు.


ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌కు ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయం (ఆర్పూ) రూ.209కి పెరిగింది. కాగా, ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా(వీఐ) మూలధన నిధులను సమీకరించగలిగినందుకు సంతోషిస్తున్నాని విఠల్‌ అన్నారు. భారత టెలికాం మార్కెట్‌ మూడు ప్రైవేట్‌ కంపెనీలతో మెరుగైన సేవలందించగలదన్నారు.

Updated Date - May 16 , 2024 | 05:13 AM