టెక్ వ్యూ : తదుపరి నిరోధం 24,000
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:12 AM
నిఫ్టీ గత వారం మైనర్ పుల్‌బ్యాక్ రికవరీ సాధించి ముందు వారంతో పోల్చితే 225 పాయింట్లు లాభపడింది. అయితే గత వారం 24,000-23,600 పాయింట్ల మధ్యన పరిమిత పరిధిలోనే కదలాడింది...
టెక్ వ్యూ : తదుపరి నిరోధం 24,000
నిఫ్టీ గత వారం మైనర్ పుల్‌బ్యాక్ రికవరీ సాధించి ముందు వారంతో పోల్చితే 225 పాయింట్లు లాభపడింది. అయితే గత వారం 24,000-23,600 పాయింట్ల మధ్యన పరిమిత పరిధిలోనే కదలాడింది. ప్రస్తుతం 23,800 వద్ద అప్రమత్త ధోరణిలో నిలిచి ఉంది. గత వారం మిడ్‌క్యాప్-100 సూచీ 73 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 సూచీ 40 పాయింట్ల స్వల్పలాభంతో ఫ్లాట్‌గా ముగిశాయి. టెక్నికల్‌గా మార్కెట్ ఇటీవల సాధించిన గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన నిలిచి ఉండడం అనిశ్చిత ధోరణిని సూచిస్తోంది. ప్రస్తుత స్థితిలో మరింత కన్సాలిడేషన్ అవసరం. స్థూల ట్రెండ్ మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. గత శుక్రవారం గరిష్ఠ స్థాయిల్లో బలహీన ధోరణి ప్రదర్శించడం కూడా మరింత బలహీనత ఉందనేందుకు సంకేతం. శుక్రవారం అమెరికన్ స్టాక్‌మార్కెట్లో ఏర్పడిన బలహీన ట్రెండ్ కారణంగా ఈ వారంలో భారత మార్కెట్ అప్రమత్తంగా కదలాడే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీకి ప్రధాన స్వల్పకాలిక నిరోధం 24,000. ఇక్కడే గత కొన్ని వారాలుగా పలు ప్రయత్నాలు చేసి మార్కెట్ విఫలమవుతూ వస్తోంది. స్వల్పకాలిక సానుకూలత కోసం మార్కెట్ ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 24300, 24,550.
బేరిష్ స్థాయిలు: మార్కెట్‌కు 23,650 వద్ద మైనర్ మద్దతు ఉంది. ఇదే గత గురువారం ఏర్పడిన బాటమ్. ఈ స్థాయి కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,500. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ టెక్నికల్ బౌన్స్‌బ్యాక్ సాధించి 550 పాయింట్ల స్వల్ప లాభంతో 51,300 వద్ద ముగిసింది. సానుకూలత కోసం ప్రధాన నిరోధం 51,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 52,000. బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం ప్రధాన మద్దతు స్థాయి 51,000 వద్ద నిలదొక్కుకుని పాజిటివ్ కన్సాలిడేషన్ సాధించాలి.
పాటర్న్: నిఫ్టీ ప్రస్తుతం 200 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. సానుకూలత కోసం 24,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. 23,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద ప్రధాన మద్దతు ఉంది. ఇక్కడ నిలదొక్కుకుంటే సానుకూల ధోరణి ఏర్పడుతుంది.
టైమ్ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,930, 24,000 మద్దతు : 23,690, 23,650
వి. సుందర్ రాజా