టెక్ మహీంద్రా లాభం రెండింతలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:43 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) టెక్ మహీంద్రా ఏకీకృత నికర లాభం రెండింతలకు పైగా పెరిగి రూ.1,250 కోట్లకు చేరుకుంది. ఆస్తుల విక్రయం...
క్యూ2లో రూ.1,250 కోట్లుగా నమోదు.. ఒక్కో షేరుకు రూ.15 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) టెక్ మహీంద్రా ఏకీకృత నికర లాభం రెండింతలకు పైగా పెరిగి రూ.1,250 కోట్లకు చేరుకుంది. ఆస్తుల విక్రయం ద్వారా ప్రత్యేక ఆదాయం సమకూరడం ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి టెక్ మహీంద్రా లాభం రూ.493.9 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.49 శాతం వృద్ధితో రూ.13,313.2 కోట్లకు పెరిగింది. కాగా, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం 46.81 శాతం, రెవెన్యూ 2.36 శాతం వృద్ధి చెందాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.15 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపులకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు నవంబరు 1ని రికార్డు తేదీగా నిర్ణయించింది.
కొత్తగా 6,653 మంది చేరిక
ఐటీ సేవల రంగంలో డిమాండ్ కాస్త నెమ్మదించినప్పటికీ, మా వ్యూహాత్మక మెరుగుదల ప్రయత్నాల్లో పురోగతిని కొనసాగించగలిగామని టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి అన్నారు. వ్యాపారాన్ని క్రమంగా కదం తొక్కించడంతో పాటు 15 శాతం నిర్వహణ లాభాల మార్జిన్ సాధన కోసం మోహిత్ జోషి ఈ ఏప్రిల్‌లో ఫోర్టియస్ పేరుతో మూడేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. గడిచిన మూడు నెలల్లో కంపెనీ 60.3 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను దక్కించుకుంది. నికరంగా 6,653 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. దాంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,273కు చేరుకుంది.