Share News

టాటా మోటార్స్‌ రూ.43,000 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - May 20 , 2024 | 04:53 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో టాటా మోటార్స్‌ గ్రూప్‌ రూ.43,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసం ఈ మొత్తాలను వెచ్చించనుంది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం...

టాటా మోటార్స్‌ రూ.43,000 కోట్ల పెట్టుబడులు

కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసమే..

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో టాటా మోటార్స్‌ గ్రూప్‌ రూ.43,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసం ఈ మొత్తాలను వెచ్చించనుంది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం బ్రిటిష్‌ విభాగమైన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)లో పెట్టే అవకాశం ఉందని టాటా మోటార్స్‌ సీఎ్‌ఫఓ పీబీ బాలాజీ వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌లో రూ.30,000 కోట్లు, టాటా మోటార్స్‌లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తొలుత తెలిపింది. అయితే ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి నిర్దేశిత లక్ష్యాలను మించి జేఎల్‌ఆర్‌లో రూ.33,000 కోట్లు, టాటా మోటార్స్‌లో రూ.8,200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు బాలాజీ తెలిపారు.


దీంతో గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.41,200 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లయిందని ఆయన పేర్కొన్నారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌లో రూ.35,000 కోట్లు, టాటా మోటార్స్‌లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 2025-26లో రేంజ్‌ రోవర్‌ బీఈవీ సహా కొన్ని పాత కార్ల స్థానంలో బ్రాండ్‌ న్యూ వాహనాలను తీసుకురానున్నట్లు బాలాజీ చెప్పారు. అలాగే ఈ ఏడాది డిఫెండర్‌ ఓక్టాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 04:53 AM