‘బేర్’ పట్టులో స్టాక్ మార్కెట్!
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:41 AM
దేశీయ స్టాక్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ఈ నెల ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఐదు శాతం వరకు నష్టపోయాయి. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) ఏకంగా రూ.29 లక్షల కోట్ల మేర తుడిచి...

ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు.. రూ.లక్ష కోట్లు వెనక్కి
సెన్సెక్స్, నిఫ్టీ మరింత పతనం?
ఇప్పటికే మదుపరుల సంపద రూ.29 లక్షల కోట్లు హాంఫట్
దేశీయ స్టాక్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ఈ నెల ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఐదు శాతం వరకు నష్టపోయాయి. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) ఏకంగా రూ.29 లక్షల కోట్ల మేర తుడిచి పెట్టుకుపోయింది. స్వల్ప,మధ్య కాలంలో నిఫ్టీ 50 మరో 1,000 పాయింట్ల మేర నష్టపోయి 23,300 పాయింట్లకు చేరే ప్రమాదం ఉందన్న టెక్నికల్ అనలిస్టుల అంచనాలు, దేశీయ స్టాక్ మార్కెట్‌ను మరింత భయపెడుతున్నాయి.
అన్ని మద్దతు స్థాయిలు బ్రేక్
ప్రస్తుతం నిఫ్టీ 50 సూచీ అన్ని స్వల్ప, మధ్యకాలిక మద్దతు స్థాయిలను బ్రేక్ చేసింది. వంద రోజులు సగటు చలన స్థాయి (డీఎంఏ) అయిన 24,565 పాయింట్ల దిగువకు కూడా పడిపోవడం విశేషం. నిఫ్టీ 50 జీవితకాల గరిష్ఠ స్థాయి 26,277 పాయింట్ల నుంచి.. ఇప్పటి వరకు ఏడు శాతం (1,899 పాయింట్లు) నష్టపోయింది.
నాలుగో రోజూ నష్టాలే
దేశీయ స్టాక్ మార్కెట్‌కు గురువారం కూడా పెద్దగా కలిసి రాలేదు. సెన్సెక్స్ 16.82 పాయింట్ల నష్టంతో 80,065.16 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్ల నష్టంతో 24,399.40 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ముగియడం వరుసగా ఇది నాలుగో రోజు. ఆరంభంలో కొద్దిపాటి లాభాలతో ప్రారంభమైనా మధ్యాహ్నం నుంచి ఆటో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోక తప్పలేదు.
పేలవమైన ఆర్థిక ఫలితాలు
లిస్టెడ్ కంపెనీలు ప్రకటిస్తున్న సెప్టెంబరు త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఆర్థిక పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీల ఆదాయాలు సగటున 10 శాతానికి మించి పెరిగే అవకాశం లేదన్న అంచనాలు, మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ.
అధిక వాల్యుయేషన్స్
గత 11 నెలలుగా కొనసాగిన ర్యాలీతో మంచి కంపెనీల షేర్లతో పాటు కొన్ని చిన్నా చితక కంపెనీల షేర్లూ వాటి స్థాయికి మించి పెరిగాయి. ముఖ్యంగా ఐపీఓ మార్కెట్లో ప్రత్యేకించి ఎస్‌ఎంఈ కంపెనీల షేర్ల లిస్టింగ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మార్కెట్ పతనానికి ఇది కూడా ఒక కారణం.
మార్కెట్ పతనానికి కారణాలు
నిన్న మొన్నటి వరకు విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ)కు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల గని. గత 11 నెలలుగా కొనసాగిన ర్యాలీతో ఈ సంస్థలు పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించాయి. తాజాగా ఈ సంస్థలకు భారత మార్కెట్ కంటే చైనా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో గత 20 రోజుల్లోనే ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు రూ.లక్ష పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కొవిడ్ సమయంలో కూడా ఈ సంస్థలు ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగలేదు. మార్కెట్ పతనానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎఫ్‌పీఐల గుడ్‌బై
సెకండరీ మార్కెట్ ర్యాలీతో ఈ సంవత్సరం ప్రైమరీ మార్కెట్ కూడా ఊపందుకుంది. ప్రతి వారం ఎంతలేదన్నా సగటున నాలుగైదు పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓ) నిధుల సమీకరణ కోసం మార్కెట్‌కు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.లక్ష కోట్లు మించింది. 2021 తర్వాత ఐపీఓ మార్కెట్‌కు ఇదే గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఆ సంవత్సరం దేశీయ కంపెనీలు ఐపీఓల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.19 లక్షల కోట్లు సమీకరించాయి.
ఐపీఓల వెల్లువ
లిస్టింగ్ లాభాలు అధికంగా ఉండడంతో రిటైల్ మదుపరులతో పాటు సంస్థాగత మదుపరులు సెకండరీ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపి ఆ మొత్తాన్ని ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.