Share News

‘గో ఫస్ట్‌’ రేసులో స్పైస్‌జెట్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:10 AM

దేశీయ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘స్పైస్‌జెట్‌’ తన కార్యకలాపాలను మరిం త విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మూతపడి, దివాలా ప్రక్రియలో ఉన్న ‘గో ఫస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

‘గో ఫస్ట్‌’ రేసులో స్పైస్‌జెట్‌

బిడ్‌ దాఖలు చేసిన సంస్థ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌

పోటీలో స్కై వన్‌ కూడా..

న్యూఢిల్లీ: దేశీయ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘స్పైస్‌జెట్‌’ తన కార్యకలాపాలను మరిం త విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మూతపడి, దివాలా ప్రక్రియలో ఉన్న ‘గో ఫస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. కంపెనీ సీఎండీ అజయ్‌ సింగ్‌ ఇందుకోసం ఇప్పటికే బిడ్‌ దాఖలు చేశారు. బిజీ బీ ఎయిర్‌వేస్‌ అనే సంస్థతో కలిసి ఆయన వ్యక్తిగత హోదాలో ఈ బిడ్‌ దాఖలు చేశారు. స్పైస్‌జెట్‌తో పాటు గో ఫస్ట్‌ కొనుగోలు కోసం షార్జా కేంద్రం గా పనిచేసే స్కై వన్‌ ఎఫ్‌జెడ్‌ఈ కూడా బిడ్‌ దాఖలు చేసింది. అయితే ఈ రెండు సంస్థలు ఎంత మొత్తానికి బిడ్లు సమర్పించాయనే విషయం వెల్లడి కాలేదు.

ఎందుకీ కొనుగోలు?

నిజానికి స్పైస్‌జెట్‌ ఇప్పటికే అనేక సమస్యల్లో ఉంది. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. ఖర్చుల హేతుబద్దీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.744 కోట్లు సమీకరించింది. ఇవి చాలక మరో రూ.1,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.

అయినా గో ఫస్ట్‌ కోసం పోటీపడుతోంది. ఈ కొనుగోలు ద్వారా దేశీయ విమానాశ్రయాల్లో గో ఫస్ట్‌కు ఉన్న స్లాట్లు, అంతర్జాతీయ ప్రయాణ హక్కులు దక్కితే ఎయిర్‌ ఇండియా, ఇండిగో పోటీని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని స్పైస్‌జెట్‌ అంచనా. ఈ కారణంతోనే మూతపడిన గో ఫస్ట్‌ కోసం పోటీపడుతోందని భావిస్తున్నారు.

మాకే వస్తుంది: స్కై వన్‌

స్పైస్‌జెట్‌ పోటీలో ఉన్నా గో ఫస్ట్‌ కొనుగోలు మీద స్కై వన్‌ చాలా ఆశలు పెట్టుకుంది. ‘ప్రపంచ విమానయాన రంగంలో మాకు అపార అనుభవం ఉంది. కాబట్టి గో ఫస్ట్‌ మాకే వస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని ఆ సంస్థ చైర్మన్‌ జైదీప్‌ మీర్‌చందానీ ఒక ప్రకటనలో తెలిపారు. స్కై వన్‌కు ప్రయాణికుల విమానాలతో పాటు సరుకుల రవాణా విమానాల్లోనూ మంచి ప్రవేశం ఉంది.

Updated Date - Feb 17 , 2024 | 04:10 AM