Share News

వేగం తగ్గిన వాహనం

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:50 AM

వరుసగా రెండో నెలా ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు నెమ్మదించాయి. మేనెలకు గాపే పీవీల టోకు విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాహన గిరాకీ...

వేగం తగ్గిన వాహనం

  • మే నెలలో నెమ్మదించిన విక్రయాల వృద్ధి

  • లోక్‌సభ ఎన్నికలు, హై బేస్‌ ఎఫెక్టే కారణం

న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలా ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు నెమ్మదించాయి. మేనెలకు గాపే పీవీల టోకు విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాహన గిరాకీ మందగించడంతో పాటు హై బేస్‌ ఎఫెక్ట్‌ (గత ఏడాది ఇదే నెల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవడం) ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. గత నెలలో వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన మొత్తం పీవీల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 4 శాతం వృద్ధితో 3,50,257 యూనిట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలల్లో కంపెనీలు తమ డీలర్లకు 3,35,436 యూనిట్ల వాహనాలను సరఫరా చేశాయి.


దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ దేశీయ విక్రయాలు మే నెలలో అతి స్వల్ప పెరుగుదలతో 1,44,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే మారుతి ఎంట్రీలెవెల్‌, కాంపాక్ట్‌ మోడళ్ల అమ్మకాలు గత నెలలో తగ్గాయి. బ్రెజ్జా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, వంటి యుటిలిటీ వాహనాల సేల్స్‌ మాత్రం పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ‘‘హై బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఈ ఏడాది ప్యాసింజర్‌ వాహన విక్రయాల వృద్ధి రెండంకెల దిగువకే పరిమితం కావచ్చు. కాగా, లోక్‌సభ ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతలు గతనెల సేల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపాయ’’ని మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ అన్నారు. ఏప్రిల్‌లోనూ వాహన పరిశ్రమ టోకు విక్రయాల వృద్ధి స్తబ్దుగా (1.5 శాతం)నే నమోదైంది.

  • గత నెలకు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన ఒక శాతం వృద్ధితో 49,151 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది పీవీల విక్రయాల వృద్ధి ఐదు శాతానికి దిగువకే పరిమితం కావచ్చని హ్యుండయ్‌ మోటార్‌ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు.


  • టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సహా) టోకు అమ్మకాలు 2 శాతం పెరిగి 47,075 యూనిట్లుగా నమోదుకాగా.. మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) హోల్‌సేల్స్‌ మాత్రం ఏకంగా 31 శాతం వృద్ధితో 43,218 యూనిట్లకు పెరిగాయి.

  • టయోటా కిర్లోస్కర్‌ టోకు అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 25,273 యూనిట్లకు చేరుకోగా.. కియా ఇండియా సేల్స్‌ 4 శాతం పెరిగి 19,500 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంజీ మోటార్‌ అమ్మకాలు మాత్రం 5 శాతం తగ్గి 4,769 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

Updated Date - Jun 02 , 2024 | 02:50 AM