Share News

స్వల్పంగా తగ్గిన ఐటీసీ లాభం

ABN , Publish Date - May 24 , 2024 | 03:10 AM

ఐటీసీ నికర లాభం మార్చి త్రైమాసికంలో స్వల్పంగా తగ్గింది. ఈ కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.19,446.49 కోట్ల ఆదాయంపై రూ.5,190.71 కోట్ల నికర లాభం ఆర్జించింది...

స్వల్పంగా తగ్గిన ఐటీసీ లాభం

ఒక్కో షేరుపై రూ.7.5 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీసీ నికర లాభం మార్చి త్రైమాసికంలో స్వల్పంగా తగ్గింది. ఈ కాలానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.19,446.49 కోట్ల ఆదాయంపై రూ.5,190.71 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం రెండు శాతం పెరిగినా నికర లాభం రూ.5,242.59 కోట్ల నుంచి 1.3 శాతం తగ్గి రూ.5,190.71 కోట్లకు చేరింది. ఖర్చులు మూడు శాతం పెరగడం ఇందుకు కారణం. స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన క్యూ 4లో ఐటీసీ ఆదాయం ఆరు శాతం పెరిగి రూ.6,534 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ రూ.69,446 కోట్ల ఆదాయంపై రూ.20,422 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 6.8 శాతం, నికర లాభం 8.9 శాతం పెరిగాయి.


రూ.7.5 చొప్పున తుది డివిడెండ్‌: క్యూ4లో నికర లాభం స్వల్పంగా తగ్గినా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూపాయి ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై వాటాదారులకు రూ.7.5 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని ఐటీసీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన రూ.6.25 మధ్యంతర డివిడెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.13.75 చొప్పున డివిడెండ్‌గా చెల్లించినట్టవుతుంది.

Updated Date - May 24 , 2024 | 03:10 AM