చడీ చప్పుడూ లేకుండా గెంటివేతలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:48 AM
సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మకంగా మారిపోతూ ఉండడంతో ఉద్యోగుల ఉద్వాసనకు కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఇంతమందిని తీసేస్తాం...అంత మందిని పంపేస్తాం అనే భారీ ప్రకటనలు ఏవీ లేకుండా.

ఉద్యోగుల ఉద్వాసనకు కొత్త వ్యూహం
ముంబై: సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మకంగా మారిపోతూ ఉండడంతో ఉద్యోగుల ఉద్వాసనకు కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఇంతమందిని తీసేస్తాం...అంత మందిని పంపేస్తాం అనే భారీ ప్రకటనలు ఏవీ లేకుండా...ఉద్యోగులు తమంత తామే ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయేలా పరోక్షంగా ఒత్తిడి (సైలెంట్ ఫైరింగ్) చేస్తున్నాయి. తాజాగా ఈ ధోరణి బాగా పెరిగిందని స్టాఫింగ్ సొల్యూషన్స్, హెచ్‌ఆర్ సర్వీసెస్ కంపెనీ జీనియస్ కన్సల్టెంట్స్ తాజా నివేదికలో తెలిపింది. అవసరాన్ని మించి ఉన్న ఉద్యోగులను తొలగించడానికి లేఆఫ్ బాట పడుతున్నట్టు 10ు కంపెనీలు తెలిపాయి. 79ు కంపెనీలు మాత్రం కొత్త టెక్నాలజీలు అలవరచుకునేలా తమ ఉద్యో గుల నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. పనితీరు సంతృప్తికరంగా లేని వారిపై అధిక పనిభారం వేసి వారు ఉద్యోగం వదులుకుని పోయేలా వ్యూహాన్ని తాము అనుసరిస్తున్నట్టు 6ు కంపెనీలు తెలిపాయి. మొత్తం 1,223 కంపెనీలు, 1,069 మంది ఉద్యోగులను ఈ సర్వే సందర్భంగా ప్రశ్నించి నివేదిక రూపొందించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆధునిక టెక్నాలజీల వినియోగాన్ని పెంచి ఉద్యోగుల అవసరం కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవాలనుకుంటున్నట్టు 39ు యాజమాన్యా లు తెలిపాయి. అయితే 31ు మంది మాత్రం ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించుకుంటూనే సమాంతరంగా మానవ వనరులను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
కొత్త టెక్నాలజీల్లో
10 లక్షల ఉద్యోగాలు
క్వాంటమ్ కంప్యూటింగ్, జెనరేటివ్ ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ రంగాల్లో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని క్వెస్ ఐటీ స్టాఫిం గ్ తాజా నివేదికలో అంచనా వేసింది. అదే కాలంలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఆర్థిక వ్యవస్థకు 15 వేల కోట్ల డాలర్ల (రూ.12.75 లక్షల కోట్లు) వాటాను అందిస్తాయని అంచనా వేసింది. 43.5 శాతం వాటాతో టెక్నాలజీ రంగంలో నియామకాలకు బెంగళూరు కేంద్ర స్థానంగా కొనసాగుతుందని కూడా తెలిపింది. 13.4 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది.