వెండి ఆల్‌టైం రికార్డు
ABN , Publish Date - May 17 , 2024 | 04:27 AM
విలువైన లోహాలు మళ్లీ కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.1,800 పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.88,000కు చేరుకుంది. కాగా, 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం...
రూ.1,800 పెరుగుదలతో రూ.88,000కు కిలో ధర.. రూ.74,000 దాటిన పసిడి
న్యూఢిల్లీ: విలువైన లోహాలు మళ్లీ కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.1,800 పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.88,000కు చేరుకుంది. కాగా, 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం రూ.650 పెరుగుదలతో రూ.74,050 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక్క రోజులోనే 21 డాలర్లు పెరిగి 2,386 డాలర్లకు ఎగబాకగా.. సిల్వర్ దాదాపు ఒక డాలర్ వరకు పెరిగి 29.55 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో ఫెడ్ రేట్ల తగ్గింపుపై మార్కెట్ వర్గాల్లో మళ్లీ ఆశలు పెరిగాయి. దాంతో బంగారం, వెండి మరింత ఎగబాకే అవకాశాలున్నాయి. త్వరలోనే ఔన్స్ గోల్డ్ 2,400 డాలర్లు, సిల్వర్ 30 డాలర్ల స్థాయిని దాటవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఫెడ్ రేట్లు-గోల్డ్ డిమాండ్‌ది విలోమ సంబం ధం. ఫెడ్ రేట్లు పెరుగుతున్న సమయంలో స్థిర ఆదాయాన్ని పంచే బాం డ్లు, మార్కెట్ ఫండ్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. దాంతో విలువైన లోహాల నుంచి పెట్టుబడులు వీటిలోకి మళ్లుతుంటాయి. కాగా, వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు ఈ లోహాల్లోకి మళ్లుతుంటాయి.
సిల్వర్@ రూ.1,00,000
ఈసారి బులియన్ ర్యాలీలో బంగారం కంటే వెండి ఆకర్షణీయ రిటర్నులు పంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో వెండి విలువైన లోహం నుంచి పారిశ్రామిక లోహం గా మారిందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ అన్నారు. ప్రపంచ పారిశ్రామిక హబ్ అయిన చైనా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మళ్లీ పుంజుకోనుందని, దాంతో వెండికి డిమాండ్ అనూహ్యంగా పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, ప్రస్తుత స్థాయితో పోలిస్తే వెండి ధరలు వచ్చే ఏడాది కాలంలో మరో 15-20 శాతం మేర పెరిగి రూ.లక్ష మైలురాయిని దాటవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, మున్ముందు నెలల్లో బంగారం, వెండి సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకోనున్నాయని ఆర్‌ఓటీహెచ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ విశ్లేషకులు అంటున్నారు. ఏప్రిల్‌లో చవిచూసిన గరిష్ఠాలను కూడా అధిగమించిన నేపథ్యంలో మున్ముందు బంగారం ధరలు మరింత ఎగబాకనున్నాయని, ఔన్స్ 2,600 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని ఆర్‌ఓటీహెచ్ చీఫ్ టెక్నికల్ స్ట్రాటజిస్ట్ జేసీ వోహ్రా అంచనా వేశారు. ఒకవేళ సిల్వర్ 30 డాలర్ల స్థాయిని అధిగమిస్తే, మున్ముందు 35-37 డాలర్ల వరకు ర్యాలీ తీయవచ్చన్నారు.