2025 డిసెంబరు నాటికి సెన్సెక్స్ 1,00,000?
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:25 AM
బీఎ్‌సఈ సెన్సెక్స్ గతంలో సాధించిన వృద్ధిని బట్టి చూస్తే, 2025 డిసెంబరు నాటికి 1,00,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. గడిచిన 45 సంవత్సరాల్లో...

ఐదేళ్లకోసారి రెండింతలవుతున్న ఇండెక్స్
ముంబై: బీఎ్‌సఈ సెన్సెక్స్ గతంలో సాధించిన వృద్ధిని బట్టి చూస్తే, 2025 డిసెంబరు నాటికి 1,00,000 పాయింట్ల మైలురాయికి చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. గడిచిన 45 సంవత్సరాల్లో సెన్సెక్స్ 15.9 శాతం సంచిత వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) నమోదు చేసుకుంది. 1979 ఏప్రిల్‌లో 100 బేస్ పాయింట్లతో ఏర్పాటైన సెన్సెక్స్.. ఇప్పటివరకు 800 రెట్ల వృద్ధిని సాధించింది. 15.9 శాతం సీఏజీఆర్‌ను మున్ముందూ కొనసాగించగలిగితే వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా లక్ష పాయింట్లకు చేరుకోగలదని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం అంచనా వేసింది. స్వల్పకాలంలో ఒడుదుడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం సూచీలు వృద్ధి పథంలోనే పయనించనున్నాయని అంటోంది.
మార్కెట్ పర్యవేక్షణ కోసం కేబినెట్ మంత్రిని నియమించాలి..
సెన్సెక్స్ ప్రస్తుత 15.9 శాతం సీఏజీఆర్‌తో ప్రతి ఐదేళ్లకు రెట్టింపవుతూ వచ్చిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్ అన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, 2029 నాటికి సెన్సెక్స్ 1,60,000కు చేరుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, దేశీయ క్యాపిటల్ మార్కెట్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సహాయ మంత్రిని నియమించాలని సూచించారు.