Share News

SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:44 AM

డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత పటిష్ఠం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో చేర్చే కంపెనీల షేర్ల అర్హతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సిద్ధమవుతోంది.

SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌

అల్లాటప్పా కంపెనీల షేర్లకు గుడ్‌బై !

చర్చా పత్రం విడుదల చేసిన సెబీ

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత పటిష్ఠం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో చేర్చే కంపెనీల షేర్ల అర్హతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. మదుపరులు, మార్కెట్‌ నిపుణులు ఈ చర్చా పత్రంపై తమ అభిప్రాయాలు, సూచనలు ఈ నెల 19లోపు తెలియజేయాలని కోరింది. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)లో పెద్దగా ట్రేడ్‌ కాని అల్లాటప్పా కంపెనీల షేర్లను తొలగించడం కూడా ఈ చర్చా పత్రం ప్రధాన లక్ష్యమని భావిస్తున్నారు. క్యాష్‌ సెగ్మెంట్‌లో పెద్దగా ట్రేడ్‌ కాని కంపెనీల షేర్లు కూడా ప్రస్తుతం ఎఫ్‌ అండ్‌ ఓ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి షేర్ల ట్రేడింగ్‌లో అక్రమాలకు అవకాశం ఉన్నందున, వీలైనంత త్వరగా వాటికి చెక్‌ పెట్టాలని సెబీ భావిస్తోంది. క్యాష్‌ సెగ్మెంట్‌లో ట్రేడయ్యే కంపెనీ షేర్ల పరిమాణం, షేర్ల లభ్యత, మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల టర్నోవర్‌ ఆధారంగా వాటికి ఎఫ్‌ అండ్‌ ఓలో చోటు కల్పించాలని సెబీ యోచిస్తోంది. ఇందుకోసం ఈ చర్చా పత్రంలో ఈ కింది అంశాలు ప్రతిపాదించింది.

  • డెరివేటివ్స్‌ జాబితాలో చేర్చే కంపెనీల షేర్లు, మొత్తం ట్రేడింగ్‌ రోజుల్లో కనీసం 75 శాతం రోజులు ట్రేడ్‌ అయి ఉండాలి.

  • యాక్టివ్‌ ట్రేడర్లలో 15 శాతం మంది లేదా 200 మంది ఏది తక్కువైతే అంత మంది కనీసం ఆయా కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌ జరిపి ఉండాలి.

  • ఆయా కంపెనీల రోజువారీ కనీస టర్నోవర్‌ రూ.500 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు ఉండాలి.

  • రోజువారీ కనీస ప్రీమియం టర్నోవర్‌ రూ.150 కోట్లు ఉండాలి.

  • అనుమతించే గరిష్ఠ ఓపెన్‌ కాంట్రాక్టుల మొత్తం రూ.1,250 కోట్ల నుంచి రూ.1,750 కోట్లు మించకూడదు.

  • టాప్‌-500 కంపెనీల జాబితా నుంచే డెరివేటివ్స్‌ మార్కెట్‌ షేర్ల ఎంపిక.

  • గత ఆరు నెలల్లో క్యాష్‌ మార్కెట్లో ఈ కంపెనీల రోజువారీ డెలివరీ షేర్ల విలువ కనీసం రూ.30-40 కోట్లు ఉండాలి.

  • ఏదైనా ఒక కంపెనీ షేర్లు ఈ అర్హతల విషయంలో విఫలమైతే, ఆ కంపెనీ షేర్లను డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌ నుంచి తొలగించాలి.

‘నామినేషన్‌’పై వెనక్కి తగ్గిన సెబీ

వారసుల నామినేషన్‌ నిబంధనపై సెబీ వెనక్కి తగ్గింది. డీమ్యాట్‌ ఖాతాదారులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లు తమ చాయిస్‌ ఆఫ్‌ నామినేషన్‌ పూర్తి చేయడం లేదా అసలు నామినేషనే వద్దనుకున్నా, ఆ విషయం ఈ నెలాఖరులోగా రిజిస్ట్రార్‌ టు ది ఇష్యూ లేదా షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లకు తెలపాలని కోరింది. లేకపోతే వారికి ఆయా కంపెనీలు, ఎంఎఫ్‌ పథకాలు లేదా రుణ పత్రాలపై రావలసిన డివిడెండ్‌, వడ్డీ లేదా రిడంప్షన్‌ చెల్లింపులు నిలిపి వేస్తామని ఇంతకు ముందు ప్రకటించింది. అయితే ఈ నిబంధన పక్కన పెట్టాలని మార్కెట్‌ వర్గాలు, మదుపరుల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెబీ ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గింది. అయితే కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించే మదుపరులకు, కొత్తగా ఎంఎఫ్‌ పెట్టుబడులు ప్రారంభించే మదుపరులకు మాత్రం ఈ నిబంధన తప్పనిసరని స్పష్టం చేసింది.

Updated Date - Jun 11 , 2024 | 04:44 AM