Share News

ఇళ్ల అమ్మకాలు అదుర్స్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:26 AM

రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 86,345 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో...

ఇళ్ల అమ్మకాలు అదుర్స్‌

  • మార్చి త్రైమాసికంలో 9 శాతం అప్‌

  • రూ.కోటి పైన ఉండే ఇళ్లకు డిమాండ్‌

  • 43 శాతం పెరిగిన ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌

  • నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 86,345 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది తొమ్మిది శాతం ఎక్కువని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో 162 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీ స్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు నమోదయ్యా యి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. ‘నివాస గృహాల అమ్మకాలు, ఆఫీసు లీజుల జోరుతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అద్భుత పనితీరు కనబరిచింది’ అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. రూ.కోటి పైన ఉండే ఇళ్లకూ మంచి డిమాండ్‌ ఉందని బైజాల్‌ చెప్పారు.

హైదరాబాద్‌లో మరింత పైకి

మార్చిత్రైమాసికం హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌కీ బాగా కలిసొచ్చింది. గత మూడు నెలల్లో హైదరాబాద్‌లో 9,550 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. కాగా ఈ కాలంలో కొత్త ఇళ్ల ధరలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం పెరిగాయని పేర్కొంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో 30 లక్షల ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. దేశంలో మరే నగరంలోనూ ఆఫీసు స్పేస్‌ లీజులు హైదరాబాద్‌లో పెరిగినంతగా పెరగలేదని కూడా తెలిపింది. హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకోవటంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కీలకంగా ఉన్నాయని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.

Updated Date - Apr 05 , 2024 | 02:26 AM