Share News

రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:43 AM

లాభాల స్వీకారంతో స్టాక్‌మార్కెట్‌ బుధవారం కుదేలైంది. సెన్సెక్స్‌ 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగియగా నిఫ్టీ 247.20 పాయింట్లు నష్టపోయి 21,951.15 వద్ద స్థిరపడింది...

రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమ్మకాల ఒత్తిడితో 800 పాయింట్లు కుంగిన సెన్సెక్స్‌

ముంబై: లాభాల స్వీకారంతో స్టాక్‌మార్కెట్‌ బుధవారం కుదేలైంది. సెన్సెక్స్‌ 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగియగా నిఫ్టీ 247.20 పాయింట్లు నష్టపోయి 21,951.15 వద్ద స్థిరపడింది. ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల అమ్మకాలతోనే సెన్సెక్స్‌ 186 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 876.93 పాయింట్లు నష్టపోయి 72,222.29 పాయింట్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకింది. స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు కూడా బుధవారం 1.82 శాతం నుంచి 1.94 శాతం వరకు నష్టపోయాయి. ఈ అమ్మకాల హోరుతో బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ రూ.6.02 కోట్లు తుడిచి పెట్టుకు పోయింది.

ఎందుకంటే ?: గురువారం ఫిబ్రవరి నెల ఎఫ్‌ అండ్‌ ఓ సెటిల్‌మెంట్స్‌కు చివరి రోజు కావడం, ప్రధాన అంతర్జాయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం, ఎఫ్‌పీఐల అమ్మకాలు, లాభాల స్వీకరణ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గించకపోవచ్చన్న వార్తలు, గురువారం వెలువడే జీడీపీ గణాంకాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న అంచనాలూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఢమాల్‌ : వొడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్లు బుధవారం మదుపరులకు చుక్కలు చూపించాయి. అమ్మకాలు హోరెత్తడంతో బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేర్లు 13.99 శాతం నష్టంతో రూ.13.65 వద్ద ముగిశాయి. దీంతో బుధవారం ఒక్క రోజే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,806.71 కోట్లు తుడిచి పెట్టుకు పోయి రూ.66,447.95 కోట్లకు చేరింది.

Updated Date - Feb 29 , 2024 | 04:43 AM