Share News

రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠం

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:34 AM

దేశంలో రిటైల్‌ ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు ఏదీ చోటు చేసుకోలేదు. ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 5.09 శాతంగా నమోదైంది. ఇది వరుసగా ఆరో నెల కూడా...

రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠం

ఫిబ్రవరిలో 5.09 శాతం

న్యూఢిల్లీ: దేశంలో రిటైల్‌ ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు ఏదీ చోటు చేసుకోలేదు. ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 5.09 శాతంగా నమోదైంది. ఇది వరుసగా ఆరో నెల కూడా ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన గరిష్ఠ కట్టడి స్థాయి 6 శాతం కన్నా దిగువనే ఉండడం విశేషం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) జనవరి నెలలో 5.1 శాతం, గత ఏడాది ఫిబ్రవరిలో 6.44 శాతం ఉంది. అయితే ఆహార వస్తువుల ధరల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. జనవరితో పోల్చితే ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 8.3 శాతం నుంచి 8.66 శాతానికి పెరిగింది. కూరగాయలు, పళ్లు, ఆయిల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌, పప్పులు, అనుబంధ ఉత్పత్తుల విభాగంలో ధరలు తగ్గినా చిరుధాన్యాలు, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల విభాగంలో మాత్రం ధరలు పెరిగాయి. సీపీఐలో ఆహార వస్తువుల వాటా సుమారు 50 శాతం ఉంటుంది. ప్రాంతాలవారీగా చూసినట్టయితే పట్టణ ప్రాంతాల (4.78 శాతం) కన్నా గ్రామీణ ప్రాంతాల్లో (5.34 శాతం) ద్రవ్యోల్బణం అధికంగా ఉంది.

నీరసించిన పారిశ్రామికం

భారత పారిశ్రామిక వృద్ధి రేటు జనవరి నెలలో మందగించింది. తయారీ, మైనింగ్‌, విద్యుత్‌ రంగాల నిరాశావహమైన పనితీరు కారణంగా పారిశ్రామిక వృద్ది రేటు 3.8 శాతానికి పరిమితం అయింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారితంగా మదింపు చేసే పరిశ్రమల వృద్ధి గత ఏడాది జనవరిలో 5.8 శాతం ఉండగా డిసెంబరులో 4.2 శాతం ఉంది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి నెలల మధ్య కాలంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే 5.5 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. విభాగాల వారీగా చూసినట్టయితే తయారీ రంగం వృద్ధి 4.5 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. విద్యుత్‌ ఉత్పత్తి 12.7 శాతం నుంచి 5.6 శాతానికి, గనుల ఉత్పత్తి 9 శాతం నుంచి 5.9 శాతానికి క్షీణించింది. యంత్రపరికరాల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 4.1 శాతానికి దిగజారింది.

భారత వాస్తవ వృద్ధి 8 శాతం

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 -25)లో భారత వాస్తవిక జీడీపీ వృద్ధిరేటు 8 శాతానికి చేరువలో ఉంటుందని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ అన్నారు. మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వృద్ధి రేటు గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా 7.6 శాతాన్ని మించి ఉంటుందని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి రేటులో మూడు త్రైమాసికాల్లో ఏర్పడిన వేగం నాలుగో త్రైమాసికంలో గణనీయంగా తగ్గితే తప్ప అది 8 శాతానికి చేరువలో ఉండడం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రుతుపవనాలు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా వేసవి పంట దిగుబడులు తగ్గి వ్యవసాయ రంగం వెనుకబడి ఉన్నదని ఆయన అన్నారు. అలాగే ప్రపంచ వృద్ధి మందగించినందువల్ల ఎగుమతుల్లో తొలి దశాబ్దిలో ఏర్పడిన వేగం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 13 , 2024 | 05:34 AM