Share News

రిలయన్స్‌ @: రూ.10 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:11 AM

మార్కెట్‌ విలువపరంగా దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మోస్తరుగానే నమోదైనప్పటికీ వార్షిక గణాంకాలు మాత్రం అద్భుతం అన్పించాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి గాను...

రిలయన్స్‌ @: రూ.10 లక్షల కోట్లు

వార్షిక టర్నోవర్‌లో సరికొత్త రికార్డు .. ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీ

రూ.లక్ష కోట్లు దాటిన వార్షిక స్థూల లాభం

మార్చి త్రైమాసిక లాభం రూ.18,951 కోట్లు

రూ.2.4 లక్షల కోట్లకు పెరిగిన ఆదాయం

ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌ ప్రకటన

ముంబై: మార్కెట్‌ విలువపరంగా దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మోస్తరుగానే నమోదైనప్పటికీ వార్షిక గణాంకాలు మాత్రం అద్భుతం అన్పించాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి గాను రిలయన్స్‌ నికర లాభం రూ.69,621 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.66,702 కోట్లుగా నమోదైంది. కాగా, 2023-24 టర్నోవర్‌ (స్థూల ఆదాయం) వార్షిక ప్రాతిపదికన 2.6 శాతం వృద్ధితో రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలో రూ.10 లక్షల కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసిన తొలి కార్పొరేట్‌ కంపెనీ రియలన్సే కావడం గమనార్హం. అంతేకాదు, వార్షిక స్థూల లాభం (పీబీటీ) కూడా తొలిసారిగా రూ.లక్ష కోట్ల స్థాయిని దాటింది. అలాగే, కంపెనీకి చెందిన డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ వార్షిక లాభం సైతం తొలిసారిగా రూ.20,000 కోట్ల మైలురాయిని దాటింది. రిలయన్స్‌ రిటైల్‌ లాభం కూడా రూ.10,000 కోట్ల మార్క్‌ను అధిగమించింది.

మరిన్ని ముఖ్యాంశాలు..

  • మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) రిలయన్స్‌ ఏకీకృత నికర లాభం రూ.18,951 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.28.01) పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2022-23) లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.19,299 కోట్ల (ఒక్కో షేరుకు రూ.28..52) లాభంతో పోలిస్తే 2 శాతం తగ్గింది.

  • క్యూ4లో కంపెనీకి వ్యాపార కార్యకలాపాల ద్వారా సమకూరిన నికర ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23లో ఇదే త్రైమాసికానికి ఆదాయం రూ.2.16 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీకి చెందిన ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ), కన్స్యూమర్‌ (టెలికాం, రిటైల్‌) వ్యాపారాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం ఆదాయం మెరుగుదలకు దోహదపడింది.

  • గడిచిన మూడు నెలల్లో రిలయన్స్‌ నిర్వహణ లాభం (ఎబిటా) 14 శాతం వృద్ధి చెంది రూ.47,150 కోట్లకు చేరుకోగా.. నిర్వహణ లాభాల మార్జిన్‌ వార్షిక ప్రాతిపదికన 0.50 శాతం పెరిగి 17.8 శాతానికి ఎగబాకింది.

  • డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే మాత్రం క్యూ4 లాభంలో 10 శాతం, ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదైంది.

  • గత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌ను చెల్లించేందుకు రిలయన్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పటికే చెల్లించిన రూ.9 డివిడెండ్‌తో కలిపి 2023-24కు గాను కంపెనీ చెల్లించబోయే మొత్తం డివిడెండ్‌ రూ.19కి చేరుకోనుంది.

  • మార్చి 31 నాటికి కంపెనీ స్థూల రుణభారం రూ.3.24 లక్షల కోట్లకు పెరిగింది. కాగా, సంస్థ వద్దనున్న నగదు నిల్వలను కూడా పరిగణనలోకి తీసుకుంటే నికర రుణ భారం రూ.1.16 లక్షల కోట్లుగా నమోదైంది.

  • కంపెనీకి చెందిన పలు వ్యాపారాలు చేపట్టిన కార్యక్రమాలు భారత ఆర్థిక వ్యవస్థలో ఆయా రంగాల త్వరితగతి వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందించాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ అన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ స్థూల లాభం (పన్నులు చెల్లించక ముందు లాభం) రూ.లక్ష కోట్లు దాటిందని, భారత కార్పొరేట్‌ రంగంలో ఈ మైలురాయిని చేరిన తొలి కంపెనీ తమదేనని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

జియో ప్లాట్‌ఫామ్‌

విభాగాల వారీగా పనితీరు

రిలయన్స్‌ జియో సహా కంపెనీ డిజిటల్‌ సేవలన్నింటినీ కలిపి ఏర్పాటు చేసిన విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ క్యూ4 లాభం వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధితో రూ.5,583 కోట్లకు చేరుకుంది. నికర ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.28,871 కోట్లుగా నమోదైంది. కాగా, వార్షిక నికర లాభం రూ.21,423 కోట్లకు, నికర రాబడి రూ.1,09,558 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ జియో కస్టమర్లు మరో 4.24 కోట్లు పెరిగి మొత్తం 48.18 కోట్లకు చేరుకున్నారు. క్యూ4లో కంపెనీకి ఒక్కో వినియోగదారు నుంచి లభించిన సగటు ఆదాయం (ఆర్పూ) రూ.181.7గా నమోదైంది.

రిలయన్స్‌ రిటైల్‌

రిలయన్స్‌ చిల్లర వర్తక వ్యాపారాల విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) క్యూ4 లాభం 11.7 శాతం పెరిగి రూ.2,698 కోట్లుగా, నికర రాబడి 9.8 శాతం వృద్ధితో రూ.67,610 కోట్లకు చేరుకుంది. వార్షిక లాభం రూ.11,101 కోట్లుగా, నికర ఆదాయం రూ.2.73 లక్షల కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో తమకు చెందిన అన్ని ఫార్మాట్ల రిటైల్‌ స్టోర్లను మొత్తం 27.2 కోట్ల మంది సందర్శించారు. 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్‌ఆర్‌వీఎల్‌ తెలిపింది. క్యూ4లో కొత్తగా తెరిచిన 562 విక్రయ కేంద్రాలతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 18,836కు చేరుకుంది.

ఓ2సీ

రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ) విభాగ ఆదాయం క్యూ4లో 10.9 శాతం వృద్ధితో రూ.1,42,634 కోట్లకు పెరగగా.. నిర్వహణ లాభం (ఎబిటా) 3 శాతం పెరిగి రూ.16,777 కోట్లుగా నమోదైంది. కాగా, వార్షికాదాయం రూ.5.64 లక్షల కోట్లు దాటగా.. నిర్వహణ లాభం రూ.62,393 కోట్లకు చేరుకుంది.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌

కంపెనీకి చెందిన ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి విభాగ ఆదాయం (ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌) క్యూ4లో 42 శాతం ఎగబాకి రూ.6,468 కోట్లకు, నిర్వహణ లాభం 47.5 శాతం వృద్ధితో రూ.5,606 కోట్లకు చేరుకుంది. వార్షికాదాయం రూ.24,439 కోట్లుగా, నిర్వహణ లాభం రూ.20,191 కోట్లుగా నమోదైంది. ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 బ్లాక్‌ నుంచి ప్రస్తుతం రోజుకు 30 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను, 23,000 బ్యారెళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated Date - Apr 23 , 2024 | 03:11 AM