Share News

నిధుల వేటలో రిలయన్స్‌ గ్రూప్‌

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:58 AM

ఇన్వెస్టర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నిండా ముంచిన అనిల్‌ అంబానీ నిర్వహణలోని రిలయన్స్‌ గ్రూప్‌ మళ్లీ నిధుల వేటలో పడింది. వ్యాపార అభివృద్ధి కోసమంటూ ఈ గ్రూప్‌లోని రెండు లిస్టెడ్‌ కంపెనీలు.....

నిధుల వేటలో రిలయన్స్‌ గ్రూప్‌

రూ.17,600 కోట్ల సమీకరణ షురూ

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నిండా ముంచిన అనిల్‌ అంబానీ నిర్వహణలోని రిలయన్స్‌ గ్రూప్‌ మళ్లీ నిధుల వేటలో పడింది. వ్యాపార అభివృద్ధి కోసమంటూ ఈ గ్రూప్‌లోని రెండు లిస్టెడ్‌ కంపెనీలు.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ రూ.17,600 కోట్లు సమీకరిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఈ కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు, వర్డే పార్ట్‌నర్స్‌ అనే అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థకు ఈక్విటీ లింక్డ్‌ ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ (ఎఫ్‌సీసీబీ) జారీ చేయడం ద్వారా మరో రూ.7,100 కోట్లు సమీకరించాయి. తాజాగా క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ఇష్యూ ద్వారా మరో రూ.6,000 కోట్లు సమీకరించేందుకు ఈ రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి.


రూ.50,000 కోట్ల పెట్టుబడులు: తండ్రి ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం ఆస్తుల పంపకం దగ్గర అన్న ముకేశ్‌ అంబానీతో గొడవపడి అనిల్‌ అంబానీ దాదాపు అన్ని వ్యాపారాల్లోనూ దివాలా తీశారు. ఈ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లు కొన్న మదుపరులతో పాటు ఈ కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంకులూ, ఆర్థిక సంస్థలూ తీవ్రంగానే నష్టపోయాయి. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ అన్నీ అనిల్‌ అంబానీ పట్టు నుంచి వెళ్లి పోయాయి. ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ మాత్రమే అనిల్‌ చేతిలో ఉన్నాయి. పాత బకాయిలు వసూలు కావడం, రుణాల పునర్‌ వ్యవస్థీకరణతో ఇప్పుడు ఈ రెండు సంస్థల మీద పెద్దగా అప్పుల బాధ లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రూ.50,000 కోట్లతో వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ రెండు కంపెనీలను మళ్లీ పట్టాలెక్కిస్తామని రిలయన్స్‌ గ్రూప్‌ చెబుతోంది


వాటాదారుల ఆమోదమే తరువాయి: నిధుల సమీకరణకు సంబంధించిన తీర్మానాలకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. అప్పుల భారం లేకపోవడంతో వాటాదారులు కూడా ఈ నెలాఖరుకల్లా ఇందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని రెండు కంపెనీల అధికార వర్గాల అంచనా. తండ్రి అనిల్‌ స్థానంలో కొడుకు అన్మోల్‌ బాధ్యతలు చేపట్టినా దేశీయ ఇన్వెస్టర్లు ఎవరూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బాగా రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధపడే విదేశీ పీఈ సంస్థలు మాత్రమే ఈ రెండు కంపెనీల ఈక్విటీలో వాటా తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం.


అంతా అన్మోల్‌ మహత్యం

కాగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌ కంపెనీల బోర్డుల నుంచి సెబీ.. అనిల్‌ అంబానీని సాగనంపింది. ఆయన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి కొత్తగా నిధులు సమీకరించేందుకూ వీల్లేదని వేటు వేసింది. దీంతో కుమారుడు జై అన్మోల్‌ అంబానీ ఈ రెండు కంపెనీల నాయకత్వ బాధ్యతలు చేపట్టి కొంతమేరకు గాడిలో పెట్టి నిధుల సేకరణకు పూనుకున్నారు. అయితే తండ్రిలా ఈయనకి లగ్జరీ కార్లంటే మహా పిచ్చి. ఈ పిచ్చిలో పడి తండ్రిలా వ్యాపారాల్ని మళ్లీ భ్రష్టుపట్టిస్తారా? లేక గట్టెక్కిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - Oct 07 , 2024 | 03:58 AM