Share News

సంస్కరణాద్యుడా.. సెలవిక..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:20 AM

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల పలువురు పారిశ్రామిక ప్రముఖలు సంతాపం తెలిపారు. దేశంలో తొలి తరం ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, ఆధునిక ఆర్థిక భారత నిర్మాతగా మన్మోహన్‌ సింగ్‌ను కొనియాడారు...

సంస్కరణాద్యుడా..  సెలవిక..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపట్ల

సంతాపం తెలిపిన పారిశ్రామిక ప్రముఖులు

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల పలువురు పారిశ్రామిక ప్రముఖలు సంతాపం తెలిపారు. దేశంలో తొలి తరం ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, ఆధునిక ఆర్థిక భారత నిర్మాతగా మన్మోహన్‌ సింగ్‌ను కొనియాడారు.

భారత్‌ రూపు మార్చిన, ప్రపంచానికి మన తలుపులు తెరిచిన 1991 ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ఆయన పోషించిన కీలకపాత్రను చరిత్ర ఎప్పటికీ గౌరవిస్తుంది. మృదువుగా మాట్లాడినప్పటికీ తన చర్యల ద్వారా చిరస్మరణీయ పురోగతిని సాధించిన అరుదైన నాయకుడు ఆయన. నాయకత్వం, వినయం, దేశ సేవలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆదర్శదాయకం, భావితరాలకు స్ఫూర్తిదాయకం.

గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌


డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. తన మేధస్సు, దయ, సమగ్రతతో భారత్‌ను ఆధునిక ఆర్థిక దేశంగా తీర్చిదిద్దారు. ఆయన మాటల కంటే చేతల్లో చూపించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.

హర్ష్‌ గోయెంకా, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు వీడ్కోలు. మీరు ఈ దేశాన్ని ప్రేమించారు. దేశానికి మీరు అందించిన సేవలు సుదీర్ఘకాలం గుర్తుండిపోతాయి.

ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌

మన్మోహన్‌ సింగ్‌ వివేకవంతమైన ఆర్థికవేత్త. గొప్ప సమగ్రత కలిగిన వ్యక్తి. తన సంస్కరణలతో భారత్‌ను తిరిగి ప్రగతిబాట పట్టించినందుకు గాను మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాం.

కిరణ్‌ మజుందార్‌ షా,

బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌

మన్మోహన్‌ సింగ్‌ గొప్ప శ్రోత. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ, ఆయన మాట్లాడినప్పుడల్లా సారాంశం మాత్రమే మాట్లాడేవారు.

దువ్వూరి సుబ్బారావు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌

Updated Date - Dec 27 , 2024 | 01:22 AM