Share News

వాల్యుయేషన్‌లో ప్రైవేట్‌ సత్తా

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:50 AM

వాల్యూయేషన్‌లో దేశీయ ప్రైవేట్‌ కంపెనీలు దూసుకుపోతున్నాయి. గత ఏడాది అక్టోబరు నాటికి రూ.6,700 కోట్ల కంటే ఎక్కువ విలువ (వాల్యుయేషన్‌) ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు మన దేశంలో 500 వరకు...

వాల్యుయేషన్‌లో ప్రైవేట్‌ సత్తా

‘టాప్‌-500’ కంపెనీల విలువ రూ.231 లక్షల కోట్లు

జీడీపీలో 71 శాతానికి సమానం

అగ్రస్థానంలో రిలయన్స్‌

ఇండస్ట్రీస్‌ జాబితాలో 29 హైదరాబాద్‌ కంపెనీలు

హురున్‌ ఇండియా-యాక్సిస్‌ బ్యాంక్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌: వాల్యూయేషన్‌లో దేశీయ ప్రైవేట్‌ కంపెనీలు దూసుకుపోతున్నాయి. గత ఏడాది అక్టోబరు నాటికి రూ.6,700 కోట్ల కంటే ఎక్కువ విలువ (వాల్యుయేషన్‌) ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు మన దేశంలో 500 వరకు ఉన్నట్టు హురున్‌ ఇండియా-యాక్సిస్‌ బ్యాంక్‌ 2023 నివేదిక వెల్లడిం చింది. ఈ టాప్‌-500 ప్రైవేట్‌ కంపెనీల జాబిఆతాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబరు నాటికి ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్‌ విలువ 2.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.231 లక్షల కోట్లు) చేరింది. ఇది గత ఏడాది దేశ స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో 71 శాతానికి సమానం. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ జీడీపీల కంటే కూడా.. గత ఏడాది భారత్‌లోని అగ్రశ్రేణి 500 ప్రైవేట్‌ కంపెనీల వాల్యుయేషన్‌ ఎక్కువగా ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు దేశంలోని విదేశీ కంపెనీలను మినహాయించి ఈ నివేదికను రూపొందించారు.

వరుసగా మూడో ఏడాది టాప్‌లో రిలయన్స్‌

దేశంలో అత్యంత విలువైన కంపెనీలపరంగా చూస్తే గత ఏడాది అక్టోబరు నాటికి రూ.15.65 లక్షల కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. రూ.12.4 లక్షల కోట్లతో టీసీఎస్‌, రూ.11.3 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరు పడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 28వ స్థానంలో నిలిచింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మళ్లీ టాప్‌-10లో స్థానం సంపాదించాయి.

70 లక్షల కొలువులు

ఈ టాప్‌-500 ప్రైవేట్‌ కంపెనీలు ఉద్యోగాల కల్పనలోనూ ముందున్నాయి. ఒక్కో కంపెనీలో సగటున 15,211 మంది పని చేస్తున్నారు. ఈ 500 కంపెనీలు మొత్తాన్ని తీసుకుంటే వీటిల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 70 లక్షల మంది వరకు ఉంటుందని నివేదిక తెలిపింది. ఇందులో 437 కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో మహిళలకు స్థానం ఉంది. మరో 179 కంపెనీల పాలన, నిర్వహణ పగ్గాలు ప్రమోటర్లకు బదులు వృత్తి నిపుణులైన సీఈఓల చేతుల్లో ఉంది.

హైదరాబాద్‌ కంపెనీల హవా

హురున్‌ ఇండియా-యాక్సిస్‌ బ్యాంక్‌ జాబితాలో 29 హైదరాబాద్‌ కంపెనీలకు చోటు లభించింది. 2022తో పోలిస్తే ఒక కంపెనీ తగ్గింది. అయితే విలువపరంగా ఈ కంపెనీల మార్కెట్‌ విలువ గత ఏడాది 18 శాతం పెరిగి రూ.5,93,718 కోట్లకు చేరింది. రూ.6,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌ గత ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. రూ.90,350 కోట్లతో దివీస్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌ కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రూ.84,150 కోట్లతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, రూ.67,500 కోట్లతో మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

నివేదికలో ఇతర ప్రధానాంశాలు

  • గత ఏడాది ఈ టాప్‌-500 కంపెనీల నికర లాభం రూ.6.8 లక్షల కోట్లు

  • రూ.74,088 కోట్లతో అత్యధిక నికర లాభం సాధించిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

  • 2023లో ఈ కంపెనీల సగటు అమ్మకాలు రూ.19,396 కోట్లు

  • టాటా గ్రూప్‌లోని 15 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.23,49,683 కోట్లు

  • 2022తో పోలిస్తే జాబితా నుంచి 61 కంపెనీలు ఔట్‌

  • 2023లో అత్యధికంగా రూ.2,92,319 కోట్ల వాల్యుయేషన్‌ పెంచుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

  • 500 కంపెనీల జాబితాలో అత్యధికంగా ఆర్థిక సేవల నుంచి 76 కంపెనీలు

  • ముంబై నుంచి అత్యధికంగా 156 కంపెనీలకు చోటు

  • జూ టాప్‌-10 అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో మేఘా ఇంజనీరింగ్‌కు మూడో స్థానం

  • 2023లో రూ.4 లక్షల కోట్ల విలువ కోల్పోయిన స్టార్టప్‌లు

  • అదానీ గ్రూప్‌లోని ఎనిమిది కంపెనీల విలువ రూ.9.9 లక్షల కోట్లు

  • జాబితాలోని 44 శాతం కంపెనీలు సేవలు, 56 శాతం కంపెనీలు వస్తూత్పత్తి కంపెనీలు.

విలువ పరంగా టాప్‌-10

హైదరాబాద్‌ కంపెనీలు

కంపెనీ విలువ

దివీస్‌ ల్యాబ్స్‌ రూ.90,350 కోట్లు

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.84,150 కోట్లు

మేఘా ఇంజనీరింగ్‌ రూ.67,500 కోట్లు

అరబిందో ఫార్మా రూ.50,470 కోట్లు

హెటిరో ల్యాబ్స్‌ రూ.24,100 కోట్లు

లారస్‌ ల్యాబ్స్‌ రూ.19,464 కోట్లు

సైయెంట్‌ రూ.17,600 కోట్లు

ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ రూ.17,500 కోట్లు

కిమ్స్‌ హాస్పిటల్స్‌ రూ.15,190 కోట్లు

దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ రూ.15,400 కోట్లు

సువెన్‌ ఫార్మా రూ.14,360 కోట్లు

నాట్కో ఫార్మా రూ.14,240 కోట్లు

Updated Date - Feb 13 , 2024 | 05:50 AM