Share News

విస్తారాలో పైలట్ల సంక్షోభం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:51 AM

టాటా గ్రూప్‌నకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ సంక్షోభంలోకి జారుకుంది. ఎయిరిండియాలో విలీనం కాబోతున్న ఈ ఎయుర్‌లైన్స్‌ మార్చి నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త వేతన ప్యాకేజీపై...

విస్తారాలో పైలట్ల సంక్షోభం

  • కొత్త వేతన ప్యాకేజీపై అసంతృప్తితో విధులకు పైలట్లు డుమ్మా

  • ఒక్కరోజే 70 విమాన సర్వీసుల రద్దు.. వివరణ కోరిన డీజీసీఏ

న్యూఢిల్లీ/ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ సంక్షోభంలోకి జారుకుంది. ఎయిరిండియాలో విలీనం కాబోతున్న ఈ ఎయుర్‌లైన్స్‌ మార్చి నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త వేతన ప్యాకేజీపై పైలట్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొత్త ప్యాకేజీతో జీతం తగ్గనున్న కారణంగా చాలామంది పైలట్లు గత కొన్ని రోజులుగా వ్యక్తిగత, అనారోగ్య కారణాలతో విధులకు హాజరు కావడం లేదు. పైలట్లు అందుబాటులో లేని కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు సర్వీసులు రద్దు కావడంతోపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం 50కి పైగా సర్వీసులు రద్దు కావడంతోపాటు కనీసం 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. మరింత మంది పైలట్లు డుమ్మా కొట్టడంతో మంగళవారం దాదాపు 70 విమాన సర్వీసులను రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు విస్తారా సోమవారమే ప్రకటించింది. ఈ విషయంపై ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌’ (డీజీసీఏ).. విస్తారాను సమగ్ర వివరణ కోరింది. విమానాల రద్దు, సేవల జాప్యంపై రోజువారీ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది. ఎయిర్‌లైన్స్‌ తాజా పరిస్థితిని డీజీసీఏ అధికారులు కన్నేసి ఉంచారు.

15 మంది పైలట్ల రాజీనామా: టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ల ఉమ్మడి భాగస్వామ్య సంస్థే విస్తారా. ఈ ఎయిర్‌లైన్స్‌ 70 విమానాలతో సేవలందిస్తోంది. మార్చి 31తో ప్రారంభమైన వేసవి షెడ్యూలు ప్రకారం.. విస్తారా రోజుకు 300కు పైగా విమాన సర్వీసులను నడపాల్సి ఉంది. అయితే, వేతన ప్యాకేజీపై అసంతృప్తితో కనీసం 15 మంది సీనియర్‌ పైలట్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు విస్తారా నిరాకరించింది.

Updated Date - Apr 03 , 2024 | 01:51 AM