Share News

పసిడీలా..!

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:25 AM

గత సంవత్సరం భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి 747.5 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది..

పసిడీలా..!

3 శాతం తగ్గిన డిమాండ్‌

ముంబై: గత సంవత్సరం భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి 747.5 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అధిక ధరలు ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2022లో గోల్డ్‌ డిమాండ్‌ 774.1 టన్నులుగా నమోదైంది. ‘‘అక్టోబరులో నవరాత్రుల సమయంలో ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారుల్లో బంగారం కొనుగోలుపై ఆసక్తి పెరగడానికి, నవంబరులో దీపావళి సందర్భంగా విక్రయాలు పెరిగేందుకు దోహదపడింది. కానీ, డిసెంబరులో ధరలు మళ్లీ ఎగబాకడంతో డిమాండ్‌ మళ్లీ డీలా పడింది. దాంతో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 9 శాతం తగ్గింది‘‘ అని డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ, ఇండియా, సోమసుందరం పీఆర్‌ అన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది 780.7 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నామని, 2022లో దిగుమతి చేసుకున్న 650.7 టన్నులతో పోలిస్తే 20 శాతం అధికమని ఆయన చెప్పారు.

ఈ ఏడాది డిమాండ్‌ 800-900 టన్నులు : దేశీయ ఆర్థిక వ్యవస్థలో సానుకూల పరిస్థితులతోపాటు ధరలు నిలకడగా కొనసాగితే ఈ ఏడాది బంగారం గిరాకీ మళ్లీ పుంజుకోవచ్చని సోమసుందరం అభిప్రాయపడ్డారు. 2024లో గోల్డ్‌ డిమాండ్‌ 800-900 టన్నుల స్థాయిలో నమోదుకావచ్చని ఆయన అంచనా వేశారు.

Updated Date - Feb 01 , 2024 | 02:25 AM