Share News

దీన్‌ దయాళ్‌ క్షేత్రంలో అరకొర ఉత్పత్తితో ఓఎన్‌జీసీకి తిప్పలు

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:44 AM

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉన్న దీన్‌ దయాళ్‌ సహజ వాయువు క్షేత్రం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి పెద్ద గుదిబండలా మారింది. భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయనే పేరుతో...

దీన్‌ దయాళ్‌ క్షేత్రంలో అరకొర ఉత్పత్తితో ఓఎన్‌జీసీకి తిప్పలు

రోజుకు కేవలం 1.45 ఎంఎస్‌సీఎఫ్‌పీడీ గ్యాస్‌ ఉత్పత్తి

గుదిబండలా మారిన క్షేత్రం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉన్న దీన్‌ దయాళ్‌ సహజ వాయువు క్షేత్రం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి పెద్ద గుదిబండలా మారింది. భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయనే పేరుతో గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జీఎ్‌సపీసీఎల్‌) ఈ గ్యాస్‌ ఫీల్డ్‌ను 2017 జూలైలో ఓఎన్‌జీసీకి అంటగట్టింది. అంతకు ముందే జీఎ్‌సపీసీ ఈ సహజ వాయు క్షేత్రంలో తనకున్న 80 శాతం వాటాలో 50 శాతం ఇస్తానన్నా ఓఎన్‌జీసీ తిరస్కరించింది. అయితే 2017కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. దీన్‌ దయాళ్‌ ఫీల్డ్‌ ఈక్విటీలో తనకున్న మొత్తం 80 శాతం వాటాను జీఎ్‌సపీసీ.. ఓఎన్‌జీసీకి రూ.7,738 కోట్లకు విక్రయించింది.


అంతా ‘గ్యాసే’

జీఎ్‌సపీసీఎల్‌ ఈ గ్యాస్‌ ఫీల్డ్‌లో 20 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్‌) గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు, దీన్నుంచి రోజూ 20 కోట్ల ప్రామాణిక ఘనపుటడుగుల (ఎంఎ్‌ససీఎ్‌ఫపీడీ) గ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చని మొదట్లో గ్యాస్‌ కొట్టింది. ఓఎన్‌జీసీకి తన 80 శాతం వాటా అమ్మే నాటికే జీఎ్‌సపీసీ ఈ క్షేత్రంలో మూడు గ్యాస్‌ బావులు తవ్వింది. ఓఎన్‌జీసీ చేతికి వచ్చాక మరో ఏడు బావులు తవ్వారు. సాంకేతిక సమస్యలతో ఇందులో మూడు బావుల డ్రిల్లింగ్‌ మఽధ్యలోనే ఆపేశారు. పూర్తి చేసిన మిగతా నాలుగు బావుల్లోనూ రోజువారీ గ్యాస్‌ ఉత్పత్తి 1.45 ఎంఎ్‌ససీఎ్‌ఫపీడీ మించడం లేదు.


ఖర్చు బారెడు

తన చేతికి వచ్చాక ఓఎన్‌జీసీ.. దీన్‌ దయాళ్‌ క్షేత్రం ఫీల్డ్‌ అభివృద్ధి కోసం పెద్ద మొత్తమే ఖర్చు చేసింది. ఈ కొనుగోలుతో జీఎస్‌పీసీఎల్‌ మాత్రం తన అప్పుల భారం కుదించుకుంది. ఓఎన్‌జీసీ మాత్రం తన మిగులు నిధుల్లో ఎక్కువ భాగం ఇందుకోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. మంచి ఆర్థిక స్థోమత, టెక్నాలజీ ఉన్న ఏదైనా సంస్థ ముందుకు వస్తే భాగస్వామ్యంతో దీన్‌ దయాళ్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ను అభివృద్ధి చేయాలని ఓఎన్‌జీసీ చూస్తోంది. అందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ గ్యాస్‌ ఫీల్డ్‌ ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీకి పెద్ద భారంగా మారింది.

Updated Date - Nov 25 , 2024 | 03:44 AM