రిలయన్స్‌తో ఎన్‌విడియా జట్టు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:34 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తో అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా కార్పొరేషన్ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో...

భారత్‌లో ఏఐ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి
టాటా కమ్యూనికేషన్‌తోనూ అమెరికన్ టెక్ దిగ్గజం డీల్
ముంబై: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తో అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా కార్పొరేషన్ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఇన్నోవేషన్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు ఎన్‌విడియా కార్ప్ సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. అలాగే, ఎన్‌విడియా తన ఏఐ చిప్‌లను ఆర్‌ఐఎల్ సహా పలు భారత కంపెనీలకు సరఫరా చేయనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కోసం రిలయన్స్.. ఎన్‌విడియాకు చెందిన అత్యాధునిక బ్లాక్‌వెల్ ఏఐ చిప్‌లను ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ భాగస్వామ్యంలో భాగంగా రిలయన్స్ పలు అప్లికేషన్లను అభివృద్ధి చేసి, కస్టమర్లకు విక్రయించనుందని ముంబైలో గురువారం ప్రారంభమైన ‘‘ఎన్‌విడియా ఏఐ సదస్సు 2024’లో పాల్గొన్న సందర్భంగా హువాంగ్ తెలిపారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది.
ఎన్‌విడియా ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా భారత్‌లోని ఆరు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ టెక్ దిగ్గజం పలు వ్యాపార సంస్థలు, క్లౌడ్ ప్రొవైడర్లు, స్టార్ట్‌పతో కలిసి.. వేలాది అత్యాధునిక జీపీయూలు, హై పెర్‌ఫార్మెన్స్ నెట్‌వర్కింగ్ అండ్ ఏఐ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ అండ్ టూల్స్‌తో కూడిన యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ స్టాక్ ద్వారా దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించనుంది. రిలయన్స్‌తో పాటు టాటా కమ్యూనికేషన్స్, హీరానందానీ గ్రూప్‌నకు చెందిన యోట్ట డేటా సర్వీసె్‌సతోనూ ఎన్‌విడియా డీల్ కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీల డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఎన్‌విడియా హోపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది.
హిందీ ఏఐ మోడల్ విడుదల: ఎన్‌విడియా హిందీ భాషలో ఏఐ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ఈ మోడల్‌ను తొలుత వినియోగించుకుందని, దీని సాయంతో ఇండస్ 2.0 అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ఎన్‌విడియా వెల్లడించింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోనూ భాగస్వామ్యం: దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోనూ ఎన్‌విడియా జత కట్టింది. టీసీఎస్ తన కస్టమర్లు ఏఐ సాంకేతికతను వేగంగా, విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్‌విడియా భాగస్వామ్యం ద్వారా ఇండస్ట్రీ ఆధారిత పరిష్కారాలు, ఆఫరింగ్స్‌ను విడుదల చేసింది.
ఏఐ ఎగుమతుల దేశంగా భారత్: అంబానీ
ఎన్‌విడియా ఏఐ సదస్సులో హువాంగ్, అంబానీతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ ఏఐ పరివర్తన సామర్థ్యం, ఈ రంగంలో మన పాత్రపై చర్చ జరిగింది. ఎన్‌విడియా-రిలయన్స్ భాగస్వామ్యంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధితో దేశీయ ఏఐ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రపంచ మేధో విపణిలో భారత్‌ను కీలక దేశంగా నిలబెట్టనుందని అంబానీ అన్నారు. త్వరలోనే భారత్ అతిపెద్ద మేధో విపణిగా అవతరించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రస్తుతం భారత్ ప్రపంచ దేశాలకు సాఫ్ట్‌వేర్, అంతర్జాతీయ కంపెనీలకు సారథులను (సీఈఓ) ఎగుమతి చేస్తోందని.. త్వరలోనే ఏఐ సేవల ఎగుమతుల దేశంగానూ అవతరించనుందన్నారు.
ఈ ఏడాదిలో 20 రెట్లు పెరగనున్న
భారత్ కంప్యూటింగ్ సామర్థ్యం: హువాంగ్
ప్రపంచ కంప్యూటర్ పరిశ్రమకు భారత్ అత్యంత ప్రియమైన దేశమని.. ఐటీ ఇండస్ట్రీకి మూల కేంద్రమని హువాంగ్ అభివర్ణించారు. ఈ ఏడాదిలో భారత కంప్యూటింగ్ సామర్థ్యం 20 రెట్లు పెరగనుందన్నారు. ఏఐ సాంకేతికత వేగంగా పురోగతి చెందుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ అంతర్గత మార్పులకు లోనవుతోందన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ ఎగుమతుల హబ్‌గా ఉన్న భారత్.. ఏఐ ఎగుమతుల్లో అగ్రగామిగా నిలవనుందన్నారు.