రతన్ టాటా వారసుడిగా నోయల్ టాటా
ABN , Publish Date - Oct 12 , 2024 | 01:59 AM
టాటా గ్రూప్‌లో వారసత్వ పగ్గాల బదిలీ ప్రశాంతంగా జరుగుతోంది. టాటా ట్రస్ట్స్ కొత్త చైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా (67) నియమితులయ్యారు. ముంబైలో శుక్రవారం జరిగిన టాటా ట్రస్ట్స్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా...
టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపిక
వెంటనే అమల్లోకి వచ్చిన నియామకం
రతన్ టాటా సవతి సోదరుడే నోయల్
నలభై ఏళ్లకుపైగా టాటా గ్రూప్‌తో అనుబంధం
ముంబై: టాటా గ్రూప్‌లో వారసత్వ పగ్గాల బదిలీ ప్రశాంతంగా జరుగుతోంది. టాటా ట్రస్ట్స్ కొత్త చైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా (67) నియమితులయ్యారు. ముంబైలో శుక్రవారం జరిగిన టాటా ట్రస్ట్స్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ ట్రస్టులకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఈక్విటీలో 66 శాతం వాటా ఉంది. దాదాపు ఈ ట్రస్టులన్నిటిలో నోయల్ టాటా ఇప్పటికే ట్రస్టీగా ఉన్నారు. కొత్త చైర్మన్‌గా నోయల్ టాటా నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రతన్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎదురు చూస్తున్నా’ అంటూ ఈ ప్రకటన వెలువడిన వెంటనే నోయల్ టాటా ట్వీట్ చేశారు.
టాటాల మనిషే
రతన్ టాటా సవతి సోదరుడైన నోయల్ టాటాకు.. టాటా గ్రూప్‌తో నలభై ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీ ‘ట్రెంట్’ బహుముఖ విస్తరణలో నోయల్ టాటాది కీలక పాత్ర. 1998లో ఒక స్టోర్‌తో ప్రారంభించి వివిధ ఫార్మాట్లలో ఆ సంస్థను 700కుపైగా స్టోర్లకు విస్తరించారు. వెస్ట్‌సైడ్, జుడియో, క్రోమాతో పాటు ఇటీవల టాటాల గూటికి చేరిన బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలన్నీ ట్రెంట్ గొడుకు కిందే పనిచేస్తాయి. లిస్టెడ్ కంపెనీ అయిన ట్రెంట్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.1.81 లక్షల కోట్ల వరకు ఉంది. ఇదిగాక టాటా గ్రూప్ కంపెనీలైన వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వంటి అనేక టాటా గ్రూప్ కంపెనీలకూ నోయల్ చైర్మన్‌గా ఉన్నారు. వీటికి తోడు టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గానూ నోయల్ టాటా వ్యవహరిస్తున్నారు.
కుటుంబ నేపథ్యం
నావెల్ హెచ్ టాటా.. నోయల్ టాటా తండ్రి. తల్లి సిమోన్ హెచ్ టాటా స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త. సిమోన్ హెచ్ టాటా కంటే ముందే నావెల్ హెచ్ టాటా రతన్ టాటా తల్లి సూనూ కమిశారియట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ద్వారా నావెల్ హెచ్ టాటాకు రతన్, జిమ్మీ జన్మించారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో నోయల్ టాటా మాత్రమే వివాహితుడు. రతన్ టాటా, జిమ్మీ టాటా అవివాహితులు. నోయల్ టాటా భార్య ఆలూ మిస్త్రీ.. రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టిన సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తె.
షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబం అతిపెద్ద ప్రైవేట్ వాటాదారుగా ఉంది. నోయల్ టాటా-ఆలూ మిస్త్రీ దంపతులకు లీ, మాయ అనే కుమార్తెలతో పాటు నెవిల్లే అనే ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో లీ టాటా.. ప్రస్తుతం తాజ్ హోటల్స్‌ను నిర్వహించే ది ఇండియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, మాయా టాటా క్యాపిటల్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పని చేస్తున్నారు. కుమారుడు నెవిల్లే కూడా ట్రెంట్, స్టార్ బజార్ సారఽథ్య బాధ్యతలు చూసుకుంటున్నారు.
2012లోనే తెరపైకి పేరు
ప్రచారానికి దూరంగా ఉండే నోయల్ టాటా పేరు నిజానికి 2012లోనే రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ చైర్మన్‌గా తెరపైకి వచ్చింది. అయితే అప్పట్లో ఆయన తన బావమరిది సైరస్ మిస్త్రీకి ఈ పదవి కట్టబెట్టేందుకు వీలుగా ఆ పదవిపై పెద్దగా ఆసక్తి చూపలేదంటారు. ఇప్పుడు రతన్ టాటా, సైరస్ మిస్త్రీ ఇద్దరూ లేకపోవడంతో ఇక టాటా గ్రూప్ సారఽథ్యం స్వీకరించేందుకు నోయల్ టాటా కాదనలేదని సమాచారం.