లంచం ఆరోపణల్లేవ్..
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:59 AM
తమ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అనుచరులపై అమెరికాలో లంచం అభియోగాలు మాత్రం నమోదు కాలేద ని గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వివరణ ఇచ్చింది...

స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఏజీఈఎల్ వివరణ
న్యూఢిల్లీ: తమ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అనుచరులపై అమెరికాలో లంచం అభియోగాలు మాత్రం నమోదు కాలేద ని గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వివరణ ఇచ్చింది. అయితే వారిపై కేవలం జరిమానాలు విధించేందుకు అవకాశాలున్న సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ సహా మూడు ఇతర అభియోగాలు నమోదైనట్లు ఏజీఈఎల్ తెలిపింది. న్యూయార్క్ కోర్టులో యూఎస్ డీఓజే (డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్) దాఖలు చేసిన అభియోగాల్లో గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ లేదా వినీత్ జైన్‌ల పేర్లను యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనల ఆరోపణల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఏజీఈఎల్ పేర్కొంది. ఏజీఈఎల్ నుంచి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల (రూ.2,200 కోట్ల) లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
20% వరకు పెరిగిన గ్రూప్ షేర్లు
ఏజీఈఎల్ తాజా వివరణతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం 20 శాతం వరకు లాభపడ్డాయి. అదానీ టోటల్ గ్యాస్ 19.76 శాతం, అదానీ పవర్ 19.66 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11.56 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ , అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం చొప్పున ఎగబాకాయి. ఎన్‌డీటీవీ షేరు 9.35 శాతం వృద్ధి చెందగా.. అదానీ విల్మర్ 8.46 శాతం, అదానీ పోర్ట్స్ 6.29 శాతం, అంబుజా సిమెంట్స్ 4.40 శాతం, ఏసీసీ 4.16 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 4.73 శాతం పెరిగాయి. దాంతో అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే రూ.1,24,693 కోట్లు పెరిగింది.
మార్కెట్‌కు అదానీ బూస్ట్
అదానీ గ్రూప్‌తోపాటు కొన్ని ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో స్టాక్ మార్కెట్ సూచీలు ఒక మోస్తరు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం సెషన్‌లో స్వల్ప లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్.. మధ్యాహ్నం ఒకదశలో 507 పాయింట్ల మేర ఎగబాకింది. చివరికి 230.02 పాయింట్ల వృద్ధితో 80,234.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80.40 పాయింట్ల లాభంతో 24,274.90 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 18 రాణించాయి. అదానీ పోర్ట్స్ షేరు 6శాతానికి పైగా ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.