విస్తరణ బాటలో ఎంటీఆర్
ABN , Publish Date - Mar 01 , 2024 | 06:12 AM
వెజిటబుల్ మసాలాలు, ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎంటీఆర్.. తన ఉత్పత్తుల పోర్టుఫోలియోను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. గురువారం నాడిక్కడ కంపెనీ వందేళ్లు పూర్తి చేసుకున్న...
త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులు
హైదరాబాద్: వెజిటబుల్ మసాలాలు, ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎంటీఆర్.. తన ఉత్పత్తుల పోర్టుఫోలియోను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. గురువారం నాడిక్కడ కంపెనీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంటీఆర్ సీఈఓ సునయ్ భాసిన్ మాట్లాడు తూ.. రెడీ టు మీల్స్, దోశ, ఇడ్లీ పిండి (బ్యాటర్) ఉత్పత్తులను త్వరలో విడుదల చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఎంటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు చాలా కీలకంగా ఉన్నాయని, కంపెనీ ఉత్పత్తులైన సాంబార్, రసం పౌడర్, గులాబ్ జామూన్ మిక్స్ ఉత్పత్తులకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కంపెనీని మరింత పటిష్ఠం చేసే ఉద్దేశంతో గడచిన మూడేళ్లలో దాదాపు రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. కాగా కంపెనీ ఇప్పటికే ఏపీలోని గుంటూరులో చిల్లీ పౌడర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోందని, తాజాగా ఇక్కడ మసాలా ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన ఉత్పత్తి లైన్‌ను ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.30 కోట్లతో ఈ ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భాసిన్ పేర్కొన్నారు. కాగా వెర్మిసెల్లీ ఉత్పత్తి కోసం హైదరాబాద్‌లో ప్లాంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.