Share News

రెండు నెలల్లో రూ.2150 కోట్లు సమీకరణ

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:22 AM

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ రాబోయే రెండు నెలల కాలంలో 25 కోట్ల డాలర్ల మేరకు (రూ.2150 కోట్లు) నిధులు సమీకరించనున్నట్టు కంపెనీ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో తాము...

రెండు నెలల్లో రూ.2150 కోట్లు సమీకరణ

  • స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ రాబోయే రెండు నెలల కాలంలో 25 కోట్ల డాలర్ల మేరకు (రూ.2150 కోట్లు) నిధులు సమీకరించనున్నట్టు కంపెనీ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో తాము అనేక ప్రతికూలతలు ఎదుర్కొంటున్నామంటూ దాని ప్రభావంతో సంస్థను మూసివేసే కన్నా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పౌర విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా సదస్సులో ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు త్రైమాసికాల్లో కంపెనీ పద్దులను ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలే స్పైస్‌జెట్‌ 15 కోట్ల డాలర్లు సమీకరించింది.


నిధుల సమీకరణ అవకాశాలు పరిశీలిస్తున్న ఇండిగో

వైడ్‌బాడీ విమానాల కొనుగోలుకు అయ్యే వ్యయం కోసం వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. తమ వద్ద పుష్కలంగా నిధులుండడం ఒక సానుకూలత అని ఆయన అన్నారు. మొత్తం 30 ఎ 350-900 విమానాలకు ఆర్డర్‌ ఇస్తున్నామని, మరో 70 విమానాల కొనుగోలు విషయం కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇండిగో వద్ద 360 విమానాలున్నాయి.


విమానయానంలో 8 శాతం వృద్ధి అంచనా

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయానం 6 నుంచి 8 శాతం వృద్ధిని సాధిస్తుందని పౌర విమానయాన సలహా సంస్థ కాపా అంచనా వేస్తోంది. ప్రయాణికులపరంగా చూస్తే 16.1 కోట్ల నుంచి 16.4 కోట్ల మంది ప్రయాణించే ఆస్కారం ఉంది. అలాగే అంతర్జాతీయ విమానయానం కూడా 9-11 శాతం వృద్ధితో 7.5 కోట్ల నుంచి 7.8 కోట్ల ప్రయాణికులకు పెరగవచ్చునని పేర్కొంది. అలాగే లాభాల్లో ఉన్న ఇండిగో మినహా ఇతర విమానయాన సంస్థల కన్సాలిడేటెడ్‌ నష్టాలు 40 నుంచి 60 కోట్ల డాలర్ల మధ్య ఉండవచ్చునని పేర్కొంది.

Updated Date - Jun 06 , 2024 | 04:22 AM