Share News

కృత్రిమ మేధతో కొలువులకు ఢోకా లేదు

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:06 AM

కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలను టీసీఎస్‌ (టెక్నాలజీ, సర్వీసెస్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌) ప్రెసిడెంట్‌ వీ.రాజన్న తోసిపుచ్చారు. వచ్చే రెండేళ్లలో ఈ రంగంలో...

కృత్రిమ మేధతో కొలువులకు ఢోకా లేదు

2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు

  • టీసీఎస్‌ ప్రెసిడెంట్‌ వీ రాజన్న

హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలను టీసీఎస్‌ (టెక్నాలజీ, సర్వీసెస్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌) ప్రెసిడెంట్‌ వీ.రాజన్న తోసిపుచ్చారు. వచ్చే రెండేళ్లలో ఈ రంగంలో 10 లక్షల కొత్త కొలువులు ఏర్పడతాయన్నారు. అయితే ఇందుకోసం అభ్యర్ధులు, ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాల్సి ఉంటుందన్నారు. బుధవారం నాడిక్కడ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన ‘ఏఐ:సెలబ్రేటింగ్‌ ది ఫ్యూచర్‌’ సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏఐ ఆధారిత పరిశ్రమల వాటా 39.4 శాతానికి చేరుతుందని కూడా రాజన్న చెప్పారు.

ఏఐ ఓ అవకాశం: గుర్నానీ

ఈ సదస్సులో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అందుకున్న టెక్‌ మహీంద్రా మాజీ సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. ‘ఏఐ ఒక అవకాశం’ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరేసరికి, ఏఐ ఆఽధారిత పరిశ్రమల వాటా 50,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

టెక్‌ మహీంద్రా మాజీ సీఈఓ సీపీ గుర్నానీకి జీవితకాల సాఫల్య పురస్కారం అందజేస్తున్న హైసియా ప్రెసిడెంట్‌ మనీషా సాబు, చిత్రంలో జయేశ్‌ రంజన్‌, రాజన్న తదితరులు

వృద్ధికి అపార అవకాశాలు

మన దేశంలో ఏఐ ఆధారిత పరిశ్రమల వృద్ధికి ఢోకా లేదని సదస్సులో పాల్గొన్న సైయెంట్‌ సీఈఓ కార్తీక్‌ నటరాజన్‌ అన్నారు. గత ఏడాది చివరి నాటికి మన దేశంలో ఏఐ ఆధారిత పరిశ్రమల వాటా 15,000 కోట్ల డాలర్లకు చేరిందన్నారు. 2023-2030 మధ్య కాలంలో ఏఐ ఆధారిత పరిశ్రమల సగటు వార్షిక వృద్ధి రేటు 36.8 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఏఐతో నవకల్పనలు, ఆర్థిక అవకాశాలు అపారంగా పెరుగుతాయని నటరాజన్‌ తెలిపారు. ఈ సదస్సులో హైసియా ప్రెసిడెంట్‌ మనీషా సాబు, ఎస్‌టీపీఐ హైదరాబాద్‌ డైరెక్టర్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 06:06 AM