ఆటోకి పెళ్లి కళ
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:28 AM
ప్రస్తుతం వివాహాల సీజన్ జరుగుతున్న నేపథ్యంలో దేశంలో కార్ల మార్కెట్ జోరందుకుంది. నవంబరులో మారుతి సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా గ్రామీణ మార్కెట్లలో...
నవంబరు నెల వాహన విక్రయాల్లో వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుతం వివాహాల సీజన్ జరుగుతున్న నేపథ్యంలో దేశంలో కార్ల మార్కెట్ జోరందుకుంది. నవంబరులో మారుతి సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా గ్రామీణ మార్కెట్లలో ఏర్పడిన రికవరీ, ఎస్‌యూవీలకు ప్రజల నుంచి లభిస్తున్న బలమైన డిమాండ్ కూడా అమ్మకాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కంపెనీలన్నీ అమ్మకాల్లో వృద్ధి సాధించాయి. మార్కెట్ దిగ్గజమైన మారుతి సుజుకీ నవంబరులో 1,41,312 కార్లను విక్రయించింది. గత ఏడాది నవంబరులో విక్రయించిన 1,34,158 యూనిట్లతో పోల్చితే 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా గత నెలలో గ్రామీణ మార్కెట్లలోకి తమ కంపెనీ విస్తరణ 48.7 శాతం ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6 వంటి యుటిలిటీ కార్ల అమ్మకాలు పెరిగాయని ఆయన అన్నారు. అయితే ఆల్టో, ఎస్-ప్రెసో వంటి మినీ కార్లు, బాలెనో, సెలేరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల విక్రయాలు మాత్రం తగ్గాయని తెలిపారు.
హ్యుండయ్ మోటార్ ఇండియా విక్రయాలు మాత్రం గత నవంబరుతో పోల్చితే 2 శాతం తగ్గి 49,451 నుంచి 48,246 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఎగుమతులు కూడా 20 శాతం తగ్గాయి. అయితే గ్రామీణ విక్రయాల వాటా మాత్రం 22.1 శాతానికి పెరిగింది.
టాటా మోటార్స్ 2 శాతం, టయోటా కిర్లోస్కర్ మోటార్ 44 శాతం, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ 20 శాతం వృద్ధిని సాధించాయి.
ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ విక్రయాలు 10 శాతం పెరిగి 4,01,250 యూనిట్లకు చేరుకోగా సుజుకీ మోటార్ సైకిల్ విక్రయాలు 8 శాతం వృద్ధితో 94,370 యూనిట్లుగా నమోదయ్యాయి.