Share News

Malabar Gold : ప్రపంచ టాప్‌-100 లగ్జరీ బ్రాండ్లలో మలబార్‌ గోల్డ్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:51 AM

ప్రపంచంలోని టాప్‌-100 లగ్జరీ బ్రాండ్ల జాబితాలో మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, టైటాన్‌ సహా మరో నాలుగు భారత కంపెనీలకు చోటు దక్కింది. అంతర్జాతీయ సంస్థ డెలాయిట్‌ విడుదల చేసిన...

Malabar Gold : ప్రపంచ టాప్‌-100 లగ్జరీ బ్రాండ్లలో మలబార్‌ గోల్డ్‌

  • టైటాన్‌, మరో 4 దేశీ బ్రాండ్లకూ స్థానం

  • జాబితా విడుదల చేసిన డెలాయిట్‌

ముంబై: ప్రపంచంలోని టాప్‌-100 లగ్జరీ బ్రాండ్ల జాబితాలో మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, టైటాన్‌ సహా మరో నాలుగు భారత కంపెనీలకు చోటు దక్కింది. అంతర్జాతీయ సంస్థ డెలాయిట్‌ విడుదల చేసిన ఈ జాబితాలో మలబార్‌ గోల్డ్‌కు 19వ స్థానం లభించింది. దేశీ బ్రాండ్లలో దీనిదే అగ్రస్థానం. టాటా గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ టైటాన్‌ 24వ స్థానంలో నిలిచింది. ఆభరణాల విక్రయ కంపెనీలైన కల్యాణ్‌ జువెలర్స్‌, జోయ్‌ అలుక్కాస్‌ వరుసగా 46,47 స్థానాలను దక్కించుకున్నాయి. సెన్‌కో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌కు 78, తంగమాయిల్‌ జువెలరీకి 98వ స్థానం లభించింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్‌ ఎల్‌వీఎంహెచ్‌ ఈ జాబితాలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. పీవీహెచ్‌ కార్ప్‌ రెండు, రిచ్‌మాంట్‌ వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని విషయాలు..

  • కోజికోడ్‌కు చెందిన మలబార్‌ గోల్డ్‌కు ఈ జాబితాలో చోటు దక్కడం ఇదే తొలిసారి. గత ఏడాది (2023)కి గాను కంపెనీ ఆదాయం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.33,200 కోట్లు)గా నమోదైంది. కాగా, టైటాన్‌ టర్నోవర్‌ 367 కోట్ల డాలర్లు (రూ.30,461 కోట్లు)గా ఉంది.

  • భారత్‌లో లగ్జరీ బ్రాండ్లు పెరుగుతుండటం దేశీయంగా విలాస ఉత్పత్తుల మార్కెట్‌ గతిని నొక్కి చెబుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యాలు కూడా పెరుగుతుండటంతో లగ్జరీ మార్కెట్‌ కూడా గణనీయ వృద్ధి సాధించనుందని రిపోర్టు పేర్కొంది. దీంతో మున్ముందు మరిన్ని భారత బ్రాండ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

  • గత ఏడాది టాప్‌-100 లగ్జరీ బ్రాండ్ల టర్నోవర్‌ వార్షిక ప్రాతిపదికన 13.4 శాతం పెరిగి 34,700 కోట్ల డాలర్ల (రూ.28,80,100 కోట్లు)కు చేరుకుంది. అందులో ప్రపంచ నం.1 లగ్జరీ బ్రాండ్‌ ఎల్‌వీఎంహెచ్‌ వాటానే 31 శాతంగా ఉంది. టాప్‌-10 బ్రాండ్ల టర్నోవర్‌ వాటా 63 శాతం. ఈ బ్రాండ్ల విక్రయాలు గత ఏడాదిలో 23 శాతం వృద్ధి చెందాయి. అంతేకాదు, టాప్‌-100 బ్రాండ్ల నికర లాభంలో 76.4 శాతం వాటా ఈ పది కంపెనీలదే.

Updated Date - Feb 20 , 2024 | 04:51 AM