Share News

శ్రీసిటీలో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Dec 10 , 2024 | 02:08 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరో బహుళ జాతి సంస్థ (ఎంఎన్‌సీ) కొలువు తీరనుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల దిగ్గజం ఎల్‌జీ గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా’ శ్రీసిటీ లేదా దానికి సమీపంలో...

శ్రీసిటీలో ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ప్లాంట్‌

  • రూ.7,000 కోట్ల పెట్టుబడి

  • 300 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి వినతి

  • నేరుగా 1,500 మందికి ఉద్యోగాలు !

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మరో బహుళ జాతి సంస్థ (ఎంఎన్‌సీ) కొలువు తీరనుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల దిగ్గజం ఎల్‌జీ గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా’ శ్రీసిటీ లేదా దానికి సమీపంలో ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. రూ.15,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రం (డీఆర్‌హెచ్‌పీ)లో కంపెనీ ఈ విషయం తెలిపింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కోసం 300 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా రూ.7,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.5,000 కోట్లు కంపెనీ నేరుగా పెట్టుబడి పెడుతుంది. మిగతా రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌కు విడిభాగాలు సరఫరా చేసే కంపెనీల నుంచి వస్తాయి. ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకుంటే నేరుగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని అంచనా. ఎందుకంటే?


ఎజీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియాకు ఇప్పటికే వివిధ గృహోపకరణాల ఉత్పత్తి కోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణెల్లో రెండు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 1,39,90,000 యూనిట్లుగా ఉంది. దక్షిణ భారత మార్కెట్‌ కోసం ఈ రెండు ప్లాంట్ల నుంచే ఉత్పత్తిని తరలించాల్సి వస్తోంది. ఇందుకు రవాణా ఖర్చులతో పాటు వివిధ సరఫరా సమస్యలు ఎదురవుతున్నాయి. శ్రీసిటీలో కొత్త ప్లాంటు ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని కంపెనీ భావిస్తోంది. దీనికి తోడు ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసే ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, టీవీలను కంపెనీ ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడి అమలుకు నోచుకుంటే ఒక కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ మన దేశంలో ఇంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. శ్రీసిటీలో ఇప్పటికే బ్లూస్టార్‌, డైకిన్‌, హావెల్‌ వంటి కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలు కొలువు తీరాయి. కాగా ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి విధానం కింద ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు పొందేందుకు ఆమోదం లభించింది.

Updated Date - Dec 10 , 2024 | 02:08 AM