బ్యాంక్ ఖాతాలకు మరోసారి కేవైసీ!?
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:59 AM
బ్యాంక్ ఖాతాదారులూ.. మీ అకౌంట్ కేవైసీని (కస్టమరు వ్యక్తిగత వివరాల ధ్రువీకరణ ప్రక్రియ) మరోసారి అప్‌డేట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతోపాటు...

పారదర్శకత పెంచడంతోపాటు
ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే..
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులూ.. మీ అకౌంట్ కేవైసీని (కస్టమరు వ్యక్తిగత వివరాల ధ్రువీకరణ ప్రక్రియ) మరోసారి అప్‌డేట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతోపాటు మోసపూరిత కార్యకలాపాలకు అడ్టుకట్ట వేసేందుకు అదనపు తనిఖీల ద్వారా కేవైసీ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని బ్యాంక్‌లు ఆలోచిస్తున్నాయి. ఈ విషయమై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చిస్తున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాలన్నింటికీ, ముఖ్యంగా ఒకే ఫోన్ నంబరుతో అనుసంధానితమైన పలు ఖాతాలు లేదా జాయింట్ అకౌంట్లకు బ్యాంక్‌లు అదనపు కేవైసీని కోరనున్నాయి. భిన్న పత్రాలతో వేర్వేరు ఖాతాలు తెరిచిన వ్యక్తుల నుంచి కూడా బ్యాంక్‌లు అదనపు సమాచారాన్ని కోరనున్నాయి. దేశీయ ఆర్థిక సేవల రంగంలో కేవైసీ నిబంధలను ప్రామాణీకరించడంతోపాటు ఆయా విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. జాయింట్ అకౌంట్లకు బహుళ స్థాయి కేవైసీలో భాగంగా మరో (సెకండరీ) గుర్తింపుగా పాన్, ఆధార్, సరికొత్త మొబైల్ నంబరును కోరాలని భావిస్తున్నట్లు సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సెకండరీ గుర్తింపు వివరాలు ఒకే వ్యక్తి భిన్న పత్రాల ద్వారా తెరిచిన వేర్వేరు ఖాతాలను (అనుసంధానితం కాని) గుర్తించేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా అకౌంట్ అగ్రిగేటర్ల (ఏఏ) నెట్‌వర్క్‌కు జాయింట్ అకౌంట్ల సమాచారం సైతం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఏఏ నెట్‌వర్క్ సింగిల్ ఆపరేటెడ్ వ్యక్తిగత ఖాతాల సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంది. అకౌంట్ అగ్రిగేటర్లు కస్టమర్ల ఆర్థిక ఆస్తులు, అప్పుల వివరాలను ఆ సమాచారాన్ని కలిగి ఉన్న బ్యాంక్‌లు లేదా ఆర్థిక సేవల సంస్థల నుంచి సేకరించి క్రెడిట్ రేటింగ్ బ్యూరోలు తదితర కంపెనీలకు అందిస్తాయి. అయితే, కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు కేవైసీ నిబంధనలను సరిగా పాటించడం లేదని, ఇవి ఖాతాదారుల సమాచారాన్ని క్రెడిట్ రేటింగ్ బ్యూరోలకు రిపోర్టు కూడా చేయడం లేదని గత ఏడాది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) ఆర్‌బీఐ వద్ద ఆందోళన వ్యక్తపరిచింది. దాంతో రుణాల మంజూరు సమయంలో క్రెడిట్ బ్యూరోల డేటాపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి నెలకొందని ఓ బ్యాంకర్ అన్నారు. ఈ నేపఽథ్యంలోనే కేవైసీ ప్రక్రియను మరింత పటిష్ఠం చేయాలని బ్యాంక్‌లు భావిసున్నాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్, ఆధార్, ఓటరు కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు పత్రాన్ని సమర్పించి బ్యాంక్ ఖాతా తెరిచేందుకు వీలుంది. గతనెలలో ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎ్‌ఫఎస్‌డీసీ) ఉమ్మడి కేవైసీ నియమావళి, కేవైసీ రికార్డుల వినియోగంలో ఆర్థిక సేవల రంగంలోని ఆయా విభాగల మధ్య సమన్వయం, కేవైసీ ప్రక్రియ సరళీకరణ, డిజిటలీకరణపై చర్చించింది.