Share News

ఐటీలో కొలువుల పండుగ

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:02 AM

ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చి వేయగల టెక్నాలజీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ సర్వీసుల విభాగంలో నియామకాలు జోరందుకోనున్నాయి. రాబోయే ఆరు నెలల...

ఐటీలో కొలువుల పండుగ

వచ్చే 6 నెలల్లో 12 శాతం

వృద్ధి అంచనా

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థల స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చి వేయగల టెక్నాలజీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ సర్వీసుల విభాగంలో నియామకాలు జోరందుకోనున్నాయి. రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ రంగంలో నియామకాలు 10-12 శాతం పెరుగుతాయని క్వెస్‌ కార్ప్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రధానంగా జెనరేటివ్‌ ఏఐ, డీప్‌ టెక్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థ చెబుతోంది. జూన్‌ త్రైమాసికంతో పోల్చితే నిపుణుల డిమాండు గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్ల (జీసీసీ) విభాగంలో 71 శాతం, సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో 58 శాతం పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ డిజిటల్‌ నైపుణ్యాల నివేదిక ప్రకారం డెవల్‌పమెంట్‌, ఈఆర్‌పీ, టెస్టింగ్‌, నెట్‌వర్కింగ్‌, డేటా సైన్స్‌ సహా ఐదు విభాగాల్లో స్థూల డిమాండు 79 శాతం పెరిగిందని ఆ విభాగం సీఈఓ కపిల్‌ జోషి తెలిపారు.


నివేదిక ముఖ్యాంశాలు..

  • టెక్‌ ఉద్యోగాలకు జీసీసీలు ప్రధాన చోదక శక్తిగా ఉన్నాయి. ఏఐ/ఎంఎల్‌, అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌, డెవ్‌ ఆప్స్‌ విభాగాల్లో నిపుణుల డిమాండు అధికంగా ఉంది.

  • టెక్‌ విభాగంలో 62 శాతం ఉద్యోగ ప్రకటనలతో బెంగళూరు తిరుగులేని నాయకత్వ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ (43.5 శాతం), పూణె (10 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • జీసీసీల విస్తరణతో విభిన్న నగరాల్లో నిపుణులకు డిమాండు గణనీయంగా పెరుగుతోంది. ఇంజినీరింగ్‌, ఐటీ, ఫైనాన్స్‌, అనలిటిక్స్‌ విభాగాల్లో నిపుణులను జీసీసీలు అధికంగా నియమించుకుంటున్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 05:02 AM