Share News

అదానీ గూటికి ఐటీడీ సిమెంటేషన్‌

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:30 AM

భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కొనుగోళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యనే ఓరియంట్‌ సిమెంట్‌ను టేకోవర్‌ చేస్తు న్నట్లు ప్రకటించిన గ్రూప్‌.. తాజాగా మరో కంపెనీని చేజిక్కించుకుంది....

అదానీ గూటికి ఐటీడీ సిమెంటేషన్‌

46.64% వాటా రూ.3,204 కోట్లకు కొనుగోలు

ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటాను రూ.2,553 కోట్లకు దక్కించుకోనున్న గ్రూప్‌

న్యూఢిల్లీ: భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కొనుగోళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యనే ఓరియంట్‌ సిమెంట్‌ను టేకోవర్‌ చేస్తు న్నట్లు ప్రకటించిన గ్రూప్‌.. తాజాగా మరో కంపెనీని చేజిక్కించుకుంది. ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్‌ ఇండియా ప్రమోటర్‌ కు చెందిన 46.64 శాతం వాటాను రూ.3,204 కోట్ల కు కొనుగోలు చేయన్నునట్లు దుబాయ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అదానీ గ్రూప్‌ కంపెనీ రెన్యూ ఎక్సిమ్‌ డీఎంసీసీ శనివారం వెల్లడించింది. కంపెనీ ప్రమోటరైన ఇటాలియన్‌- థాయ్‌ డెవలప్‌మెంట్‌ పబ్లిక్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐటీడీ) నుంచి ఒక్కో షేరు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు విధిగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. అలాగే, బహిరంగ మార్కెట్లో ఐటీడీ సిమెంటేషన్‌ పబ్లిక్‌ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సెబీ నిబంధనల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ సైతం ప్రకటించింది.


ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరుకు రూ.571.68 చొప్పున చెల్లించనుంది. 26 శాతం వాటా కొనుగోలుకు మొత్తం రూ.2,553 కోట్లు వెచ్చించనుంది. అంటే, మొత్తం 72.64 శాతం వాటాను రూ.5,757 కోట్లకు దక్కించుకోనుంది. విమానాశ్రయాలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టు విభాగాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ సామర్థ్యాలను పెంచుకునేందుకు అదానీ గ్రూప్‌నకు ఐటీడీ సిమెంటేషన్‌ కొనుగోలు దోహదపడనుంది.

బీఎస్‌ఈలో ఐటీడీ సిమెంటేషన్‌ షేరు ధర శుక్రవారం రూ.532.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9,152 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో కంపెనీ షేరు 180 శాతానికి పైగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఐటీడీ సిమెంటేషన్‌ రూ.7,542 కోట్ల ఆదాయంపై రూ.274 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

Updated Date - Oct 27 , 2024 | 05:30 AM