Share News

లాభాల స్వీకరణతో పతన బాటలోకి..

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:38 AM

కొద్ది రోజులుగా ఏర్పడిన ర్యాలీని సొమ్ము చేసుకునే లక్ష్యంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకారానికి దిగడంతో శుక్రవారం ఈక్విటీ మార్కెట్‌ ఒక శాతం మేరకు నష్టపోయింది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో..

లాభాల స్వీకరణతో పతన బాటలోకి..

సెన్సెక్స్‌ 793 పాయింట్లు డౌన్‌

ముంబై: కొద్ది రోజులుగా ఏర్పడిన ర్యాలీని సొమ్ము చేసుకునే లక్ష్యంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకారానికి దిగడంతో శుక్రవారం ఈక్విటీ మార్కెట్‌ ఒక శాతం మేరకు నష్టపోయింది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవటంతో జూన్‌ నాటికైనా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలు సన్నగి ల్లటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా కొద్ది రోజుల ర్యాలీకి స్వస్తి చెప్పిన సెన్సెక్స్‌ 793.25 పాయింట్లు నష్టపోయి 74,244.90 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 234.40 పాయింట్ల నష్టంతో 22,519.40 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ షేర్లలో 27, నిఫ్టీ షేర్లలో 45 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే రూ.2,52,301.16 కోట్లు క్షీణించి రూ.3,99,67,051.91 కోట్ల వద్ద స్థిరపడింది.

భారతి హెక్సాకామ్‌ లాభాల పంట: శుక్రవారం భారతి హెక్సాకామ్‌ షేరు ఇష్యూ ధర రూ.570తో పోల్చితే 32.49 శాతం ప్రీమియంతో రూ.755.20 వద్ద బీఎ్‌సఈలో లిస్టయింది. తదుపరి క్రమంలో 54.36 శాతం లాభంతో రూ.879.90 స్థాయిని తాకిన ఈ షేరు చివరికి 42.80 శాతం లాభంతో రూ.813.75 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో కూ డా ఈ షేరు 32.45 శాతం లాభంతో రూ.755 వద్ద లిస్టయి చివరికి 42.80 శాతం లాభంతో రూ.814 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.40,687.50 కోట్లుగా నమోదైంది.

ఫారెక్స్‌ నిల్వల్లోనూ కొత్త రికార్డు: దేశంలో విదేశీ మారక నిల్వలు ఏప్రిల్‌ 5వ తేదీతో ముగిసిన వారంలో 298 కోట్ల డాలర్లు పెరిగి 64,856.2 కోట్ల డాలర్లకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో ఇది కొత్త రికార్డు. రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయిస్తూ ఉండడంతో గత కొన్ని నెలలుగా క్షీణిస్తూ వచ్చిన ఫారెక్స్‌ నిల్వలు ఇటీవల వారాల్లో తిరిగి రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇదే వారంలో బంగారం నిల్వలు 239.8 కోట్ల డాలర్లు పెరిగి 5,455.8 కోట్ల డాలర్లకు చేరాయి.

Updated Date - Apr 13 , 2024 | 02:38 AM