Share News

ఇన్ఫీ లాభం రూ.7, 969 కోట్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:38 AM

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధితో రూ.7,969 కోట్లకు చేరుకుంది...

ఇన్ఫీ లాభం రూ.7, 969 కోట్లు

క్యూ4లో 30 శాతం వృద్ధి నమోదు

రూ.37,923 కోట్లకు పెరిగిన ఆదాయం

2024-25 ఆదాయ వృద్ధి అంచనా 1-3%

ఒక్కో షేరుకు మొత్తం రూ.28 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధితో రూ.7,969 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇదే త్రైమాసికానికి కంపెనీ లాభం రూ.6,128 కోట్లుగా ఉంది. కాగా, 2023-24 క్యూ4లో ఇన్ఫీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇదే కాలానికి రూ.37,441 కోట్ల ఆదాయం గడించింది. కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్‌ క్యూ4లో 20.1 శాతానికి తగ్గగా.. 2023-24 మొత్తానికి 20.7 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇన్ఫీ నికర లాభం 8.9 శాతం వృద్ధితో రూ.26,233 కోట్లకు చేరుకోగా.. ఆదాయం 4.7 శాతం పెరిగి రూ.1,53,670 కోట్లుగా నమోదైంది.

7.5 శాతం తగ్గిన ఉద్యోగులు

క్యూ3తో పోలిస్తే క్యూ4లో నికరంగా 5,423 మంది ఉద్యోగులు తగ్గారు. దాంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం (25,994 మంది) తగ్గి 3,17,240 మందికి పరిమితమైంది. ఇన్ఫోసిస్‌ వార్షిక ఉద్యోగుల సంఖ్య తగ్గడం గడిచిన 23 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతేకాదు, వరుసగా ఐదు త్రైమాసికాలుగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కాగా, క్యూ4లో సంస్థ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 12.6 శాతానికి తగ్గింది.

1,770 కోట్ల డాలర్ల భారీ ఆర్డర్లు

క్యూ4లో కంపెనీకి 450 కోట్ల డాలర్ల భారీ కాంట్రాక్టులు దక్కగా.. 2023-24 మొత్తానికి ఈ విలువ ఆల్‌టైం రికార్డు స్థాయి 1,770 కోట్ల డాలర్లకు పెరిగిందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ‘‘క్లయింట్లకు తమపైన ఉన్న బలమైన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఇన్ఫీ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ అన్నారు.

డివిడెండ్‌ బొనాంజా

గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.20 తుది డివిడెండ్‌తో పాటు రూ.8 ప్రత్యేక డివిడెండ్‌ను సైతం ప్రకటించింది. ఇందుకు అర్హులైన వాటాదారులను మే 1న ఎంపిక చేసి, జూలై 1న చెల్లింపులు జరుపనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గతంలో ప్రకటించిన రూ.35.5 డివిడెండ్‌తో కలిపి 2023-24కు గాను కంపెనీ చెల్లించే డివిడెండ్‌ మొత్తం రూ.63.5కు చేరుకోనుంది.

ఏడీఆర్‌లు 8 శాతం డౌన్‌

ఈ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) ప్రకటించిన ఆదాయ వృద్ధి అంచనా నిరాశాజనకంగా ఉండటంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రీ-మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (ఏడీఆర్‌) దాదాపు 8 శాతం వరకు క్షీణించాయి. 2024-25లో స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి 1-3 శాతంగా ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది. అయితే, ఈసారి కంపెనీ ఆదాయ వృద్ధిని 2-6 శాతం స్థాయిలో అంచనా వేయవచ్చని భావించిన మార్కెట్‌ వర్గాలకు నిరాశే ఎదురైంది. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) తొలుత అంచనా వేసిన 4-7 శాతం ఆదాయ వృద్ధితో పోలిస్తే కంపెనీ ఈసారి అంచనాలను చాలా తగ్గించింది. అయితే, 2023-24 ఆదాయ వృద్ధి అంచనాను ప్రతి త్రైమాసికంలోనూ తగ్గిస్తూ వచ్చిన కంపెనీ.. క్యూ3 ఫలితాల ప్రకటన సందర్భంగా 1..5-2 శాతానికి కుదించింది. ‘‘2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధితో పోలిస్తే 2024-25 ఆదాయ వృద్ధి అంచనా అధికమే అయినప్పటికీ వ్యత్యాసం చాలా స్వల్పం. ఇండస్ట్రీల వారీగా చూస్తే, ఆర్థిక సేవల రంగం ముఖచిత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా కన్పిస్తోంద’’ని ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌ అన్నారు.

రూ.4,000 కోట్లకు జర్మన్‌ కంపెనీ కొనుగోలు

జర్మనీకి చెం దిన ఇన్‌-టెక్‌ కంపెనీలో 100 శాతం వాటాను 45 కోట్ల యూరోల (దాదాపు రూ.4,000 కోట్లు)కు కొనుగోలు చేయబోతున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరగనుంది. ఇన్‌-టెక్‌ కంపెనీ ఈ-మొబిలిటీ, కనెక్టెడ్‌ అండ్‌ అటానమస్‌ డ్రైవింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆఫ్‌ రోడ్‌ వెహికిల్స్‌, రైల్‌ రోడ్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ కొనుగోలు ప్రక్రి య పూర్తి కావచ్చని అంచనా. జర్మనీకి చెందిన దిగ్గజ వాహన కంపెనీలతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్న ఇన్‌-టెక్‌ కొనుగోలు ఇన్ఫోసి్‌సకు ఆటోమోటివ్‌ రంగంలో భవిష్యత్‌ తరం టెక్నాలజీ సేవలందించేందుకు దోహదపడనుంది. ఇన్‌-టెక్‌లో 2,200 మంది పనిచేస్తున్నారు. జర్మనీతో పాటు ఆస్ట్రియా, చైనా, యూకే, చెక్‌ రిపబ్లిక్‌, రొమేనియా, స్పెయిన్‌, ఇండియాలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Updated Date - Apr 19 , 2024 | 02:38 AM