Share News

10 లక్షల కోట్ల డాలర్ల బాటలో భారత్‌

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:18 AM

భారత జీడీపీ 10 లక్షల కోట్ల డాలర్ల మైలురాయి వైపుగా దూసుకెళ్తున్నదని, మరో 2-3 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు...

10 లక్షల కోట్ల డాలర్ల బాటలో భారత్‌

త్వరలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరణ

  • డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే

న్యూఢిల్లీ: భారత జీడీపీ 10 లక్షల కోట్ల డాలర్ల మైలురాయి వైపుగా దూసుకెళ్తున్నదని, మరో 2-3 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ స్థాయి ఆశావహ స్థితి మరెక్కడా చూడలేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. సమయం ఆసన్నమైనప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి ఇక్కడ డబ్ల్యూఈఎఫ్‌ ఇండియా సదస్సును నిర్వహిస్తామన్నారు.

బ్రెండే ఇంకా ఏమన్నారంటే..

  • ప్రపంచంలోని బడా ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకెల్లా భారత్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులోనూ ఇన్వెస్టర్లలో భారత్‌పై అమితాసక్తి కనిపించింది. రాబోయే కాలంలో కూడా ఇది కొనసాగుతుందని నాకనిపిస్తోంది.

  • భారత్‌ ప్రస్తుతం 7 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్తోంది. గడిచిన కొన్నేళ్లలో భారత్‌లో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. దాంతో అమెరికా, చైనాకు దీటుగా ఎదుగుతోంది.

  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో చైనా సహా పలు వర్ధమాన మార్కెట్లలో జరిగే తయారీ కార్యకలాపాలు భారత్‌కూ తరలివస్తున్నాయి.

  • భారత డిజిటల్‌ పోటీ సామర్థ్యం ప్రశంసనీయం. ప్రపంచంలో ప్రస్తుతం సంప్రదాయ వస్తు వర్తకం కంటే డిజిటల్‌ వర్తకమే అధికంగా జరుగుతోంది. డిజిటలీకరణ విషయంలో 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌ కీలక దేశంగా మారింది.

వచ్చే పదేళ్లు 6-8% వృద్ధి: వైష్ణవ్‌

వచ్చే పదేళ్లు భారత జీడీపీ నిలకడగా 6-8 శాతం వృద్ధిరేటును నమోదు చేసుకోనుందని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంతోపాటు కొత్త ఆలోచనలకు భారత తలుపులు తెరిచే ఉంటాయని గురువారం ‘రైసిన్‌ డైలాగ్‌ 2024’ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా ఆయన అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం తయారీ, విద్య ద్వారా పేదరిక నిర్మూలన, హెల్త్‌కేర్‌ రంగంలో పెద్దఎత్తున సాంకేతికత వినియోగం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వనుందని మంత్రి సంకేతాలిచ్చారు.

Updated Date - Feb 23 , 2024 | 03:18 AM