Share News

సరికొత్త శిఖరాలకు సూచీలు

ABN , Publish Date - May 24 , 2024 | 03:14 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. గత ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్‌ ప్రకటించడం మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహం పెంచింది...

సరికొత్త శిఖరాలకు సూచీలు

  • 23,000కు చేరువలో నిఫ్టీ

  • మళ్లీ 75,000 ఎగువన సెన్సెక్స్‌

  • మార్కెట్లకు ఆర్‌బీఐ డివిడెండ్‌ జోష్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. గత ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్‌ ప్రకటించడం మార్కెట్‌ వర్గాల్లో ఉత్సాహం పెంచింది. బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో షేర్లలో మదుపరులు భారీగా కొనుగోళ్లు జరిపారు. దాంతో సెన్సెక్స్‌ 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. ఈ జనవరి 29 తర్వాత ఒక రోజులో సూచీకిది అతిపెద్ద లాభం. అంతేకాదు, ఒకదశలో సెన్సెక్స్‌ 1,278.85 పాయింట్ల వరకు ఎగబాకి 75,499.91 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డునూ నమోదు చేసింది. నిఫ్టీ విషయానికొస్తే ఒకదశలో 395.8 పాయింట్లు పెరిగి 22,993.60 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని, చివరికి 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద ఆల్‌టైం రికార్డు ముగింపును నమోదు చేసింది. కొనుగోళ్ల జోరుతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.28 లక్షల కోట్లకు పైగా పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.420.22 లక్షల కోట్లకు (5.05 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. అలాగే, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటైజేషన్‌ తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.416.57 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది.


30లో 27 లాభపడ్డాయ్‌.. : సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. ఎల్‌ అండ్‌ టీ షేరు 3.64 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయి నర్‌గా నిలిచింది. ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ షేర్లు సైతం మూడు శాతానికి పైగా పెరిగాయి.

అదానీ షేర్లు జిగేల్‌

వరుసగా రెండో రోజూ అదానీ గ్రూప్‌ షేర్లు ర్యాలీ తీశాయి. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఏకంగా 8 శాతం పుంజుకుంది. ఈ కంపెనీని సెన్సెక్స్‌లో చేర్చవచ్చన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయి. కాగా, ఎన్‌డీటీవీ 7.56 శాతం, అదానీ పోర్ట్స్‌ 4.72 శాతం, ఏసీసీ 2.86 శాతం, అదానీ పవర్‌ 2.79 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 2.30 శాతం, అంబుజా సిమెంట్స్‌ 2.09 శాతం, అదానీ విల్మర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. దాంతో గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17.23 లక్షల కోట్లకు చేరుకుంది. బుధవారం గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 20,000 కోట్ల డాలర్ల (రూ.16.9 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది.


సెన్సెక్స్‌లోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

తొలిసారిగా అదానీ గ్రూప్‌ కంపెనీ సెన్సెక్స్‌లో చోటు దక్కించుకోబోతోంది. సెన్సెక్స్‌ జాబితా నుంచి విప్రోను తొలగించి, దాని స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను చేర్చే అవకాశం ఉంది. శుక్రవారం నిర్వహించనున్న అర్ధ వార్షిక సమీక్షలో బీఎస్‌ఈ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జూన్‌ 21న సెన్సెక్స్‌ కంపెనీల సర్దుబాటు అమలులోకి రానుంది.

గో డిజిట్‌ షేరు తొలిరోజు వృద్ధి 12 శాతం

గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ గురువారం షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టింగ్‌ చేసింది. ఐపీఓ ధర రూ.272తో పోలిస్తే, బీఎస్‌ఈలో కంపెనీ షేరు 3.34 శాతం ప్రీమియంతో రూ.281.10 వద్ద లిస్టయింది. ఒకదశలో 15.44 శాతం వరకు పెరిగి రూ.314 స్థాయికి చేరిన షేరు ధర చివరికి 12.40 శాతం లాభంతో రూ.305.75 వద్ద ముగిసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.28,043.46 కోట్లుగా నమోదైంది.


భారీగా తగ్గిన బంగారం, వెండి

దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గురువారం రూ.1,050 తగ్గి రూ.73,550 వద్దకు దిగివచ్చింది. కిలో వెండి సైతం రూ.2,500 తగ్గుదలతో రూ.92,600కు పరిమితమైంది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ సెంటర్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం మళ్లీ 2,400 డాలర్ల దిగువకు పడిపోయింది. ఒకదశలో రేటు 42 డాలర్లు తగ్గి 2,375 డాలర్ల వద్ద ట్రేడైంది. వెండి సైతం 30.80 డాలర్లకు దిగివచ్చింది.


స్టెరిలైట్‌ వ్యాపార విభజనకు ఆమోదం

విద్యుత్‌ సరఫరా వ్యాపారాన్ని విభజించేందుకు తమ వాటాదారులు ఆమోదం తెలిపారని స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ (ఎ్‌సటీపీఎల్‌) వెల్లడించింది. విభజించిన ట్రాన్స్‌మిషన్‌ వ్యాపారాన్ని స్టెరిలైట్‌ గ్రిడ్‌ 5 లిమిటెడ్‌లో చేర్చనున్నారు. గ్లోబల్‌ ప్రొడక్ట్స్‌, ఈపీసీ సేవల విభాగాలు మాత్రం ఎస్‌టీపీఎల్‌ పరిధిలో కొనసాగనున్నాయి.

Updated Date - May 24 , 2024 | 03:14 AM