Share News

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,053 కోట్లు

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:23 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం వృద్ధితో రూ.11,052.60 కోట్లకు చేరుకుంది...

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,053 కోట్లు

క్యూ3లో 25.7 శాతం వృద్ధి నమోదు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం వృద్ధితో రూ.11,052.60 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ3లో బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలలకు బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13.4 శాతం వార్షిక వృద్ధితో రూ.18,678 కోట్లకు చేరుకోగా.. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 4.43 శాతానికి తగ్గింది. మరిన్ని విషయాలు..

  • గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ దేశీయ రుణాల వృద్ధి 18.8 శాతంగా నమోదు కాగా.. ఇతర ఆదాయం 19.8 శాతం పెరుగుదలతో రూ.5,975 కోట్లకు ఎగబాకింది.

  • బ్యాంక్‌ డిపాజిట్ల వృద్ధి 18.7 శాతంగా ఉంది. క్రెడిట్‌- డిపాజిట్‌ నిష్పత్తి 86 శాతంగా నమోదైంది.

  • గడిచిన మూడు నెలలకు బ్యాంక్‌ కేటాయింపులు రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం లో ఇదే కాలానికి బ్యాంక్‌ రూ.2,257 కోట్లకు పైగా కేటాయింపులు జరిపింది.

  • గడిచిన మూడు నెలల్లో రూ.5,000 కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిల పద్దులోకి చేరాయని, అందులో అధిక శాతం గ్రామీణ మార్కెట్‌ రుణాలేనని బ్యాంక్‌ పేర్కొంది.

  • ఆర్‌బీఐ హెచ్చరికల అనంతరం తనఖా లేని వ్యక్తిగత రుణాల మంజూరు విషయంలోనూ బ్యాంక్‌ జోరు తగ్గించుకుంది. ఈ క్యూ3లో ఈ విభాగ రుణాల వృద్ధి 37 శాతానికి తగ్గింది. అంతేకాదు, ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన బ్యాంకింగేతర రుణదాతలకు ఫండింగ్‌ను సైతం రూ.79,000 కోట్ల నుంచి రూ.74,000 కోట్లకు తగ్గించుకున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

Updated Date - Jan 21 , 2024 | 02:23 AM