Share News

సమయ పాలనలో హైదరాబాద్‌ విమానాశ్రయం బెస్ట్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:57 AM

నిర్వహణాపరమైన పనితీరు, సమయపాలనలో మన దేశానికి చెందిన హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాలు తమ సత్తా చాటాయి. ఈ విషయంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌...

సమయ పాలనలో హైదరాబాద్‌ విమానాశ్రయం బెస్ట్‌

అంతర్జాతీయంగా రెండో స్థానం

మూడో స్థానంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

న్యూఢి ల్లీ: నిర్వహణాపరమైన పనితీరు, సమయపాలనలో మన దేశానికి చెందిన హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా విమానాశ్రయాలు తమ సత్తా చాటాయి. ఈ విషయంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అంతర్జాతీయంగా పెద్ద ఎయిర్‌పోర్టులో విభాగంలో రెండో స్థానంలో నిలవగా బెంగళూరు విమానాశ్రయం మూడో స్థానంలో, కోల్‌కతా ఎయిర్‌పోర్టు తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ‘ఆన్‌- టైమ్‌ పెర్‌ఫార్మెన్స్‌ (ఓటీపీ) రివ్యూ’ పేరుతో సిరియం అనే ఏవియేషన్‌ అనలిటిక్స్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది. నిర్వహణపరమైన పనితీరు, సమయ పాలనపరంగా అమెరికా, మిన్నెపొలి్‌సలోని సెయింట్‌ పాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44 శాతం ఓటీపీతో అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) 84.42 శాతం ఓటీపీతో రెండో స్థానంలో, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08 శాతం ఓటీపీతో మూడో స్థానంలో నిలిచాయి. మీడియం విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఎనిమిదో స్థానంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌

బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్‌ 92.36 శాతం ఓటీపీతో అగ్రస్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 82.12 శాతం ఓటీపీతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం పరంగా చూస్తే లో బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్‌ (82.75 శాతం ఓటీపీ), జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ (82.58 శాతం ఓటీపీ), థాయ్‌ ఎయిర్‌ ఏషియా (82.52 శాతం ఓటీపీ) తొలి మూడు స్థానాల్లో ఉండగా మన దేశానికి చెందిన ఇండిగో నాలుగో స్థానంలో ఉంది.

Updated Date - Jan 03 , 2024 | 01:57 AM