Share News

ఏపీలో హెచ్‌యూఎల్‌ పామాయుల్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:12 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌ పామ్‌ సాగుతో పాటు పామాయిల్‌ ఉత్పత్తిని చేపట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంతో జట్టు కట్టేందుకు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సన్నాహాలు చేస్తోంది.

ఏపీలో హెచ్‌యూఎల్‌ పామాయుల్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌ పామ్‌ సాగుతో పాటు పామాయిల్‌ ఉత్పత్తిని చేపట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంతో జట్టు కట్టేందుకు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సన్నాహాలు చేస్తోంది. ఇటీవల నెల్లూరులో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డితో హెచ్‌యూఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు దేవ్‌ బాజ్‌పాయ్‌, యోగేష్‌ మిశ్రా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రైతులు, పారిశ్రామిక రంగానికి నేరుగా లబ్ది చేకూర్చే విధంగా పామాయిల్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వారికి తెలిపారు. రాష్ట్రంలో 15 వేల మందికి పైగా రైతులను భాగస్వాములుగా చేర్చుకుని కనీసం 30 వేల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని హెచ్‌యూఎల్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్‌ పామ్‌ నర్సరీలు, సేకరణ కేంద్రాలతో పాటు పామాయిల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రానున్న సంవత్సరాల్లో రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రతిపాదిత ప్లాంట్‌ ద్వారా 1000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హెచ్‌యూఎల్‌ ఇప్పటికే రాజమండ్రిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని, తాజాగా పామాయిల్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని చూస్తోందని కంపెనీ ఈడీ దేవ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. కంపెనీ స్కిన్‌ ఉత్పత్తుల పోర్టుఫోలియోకు అవసరమైన ఉత్పత్తులను వ్యూహాత్మకంగా ఇక్కడి నుంచి సేకరించాలని చూస్తున్నట్లు దేవ్‌ తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 04:12 AM