Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

జీఎస్‌టీ అప్పీలు దాఖలు చేయటం ఎలా..?

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:54 AM

జీఎ్‌సటీకి సంబంధించి ఏవేనీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు భావిస్తే డిపార్ట్‌మెంట్‌ ఒక వ్యక్తికి లేదా వ్యాపార సంస్థకు ముందుగా ఒక నోటీస్‌ పంపిస్తుంది. ఈ నోటీస్‌ అనేది ట్యాక్స్‌కు సంబంధించినదై ఉండవచ్చు లేదా...

జీఎస్‌టీ అప్పీలు దాఖలు చేయటం ఎలా..?

జీఎ్‌సటీకి సంబంధించి ఏవేనీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు భావిస్తే డిపార్ట్‌మెంట్‌ ఒక వ్యక్తికి లేదా వ్యాపార సంస్థకు ముందుగా ఒక నోటీస్‌ పంపిస్తుంది. ఈ నోటీస్‌ అనేది ట్యాక్స్‌కు సంబంధించినదై ఉండవచ్చు లేదా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ), రిఫండ్‌, వడ్డీ లేదా ఇతర కారణాలైనా అయి ఉండవచ్చు. నోటీ్‌సలోని అభియోగాలు, దానికి సంబంధించి సదరు వ్యక్తి లేదా సంస్థ ఇచ్చిన జవాబులను, సంబంధిత ఆధారాలను బట్టి ఒక ఆర్డర్‌ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆర్డర్‌ లేదా నిర్ణయం తనకు అనుకూలంగా లేదని భావిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ ఆ ఆర్డర్‌ మీద అప్పీల్‌ చేసుకోవచ్చు. సాధారణ భాషలో చెప్పాలంటే ఇది దిగువ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఎగువ కోర్టుకు వెళ్లినట్లు. అప్పీల్‌ దాఖలు చేయటానికి నిర్ధిష్ట నియమ నిబంధనలు ఉన్నాయి. అవి పాటించకపోతే అప్పీల్‌ స్వీకరణ తీసుకోబడదు. అలాంటప్పుడు తనకు అనుకూలంగా వాదనలు ఉన్నప్పటికీ, అప్పీల్‌ ప్రాధమిక దశలోనే తిరస్కరణకు గురి కావటం జరుగుతుంది. కాబట్టి అప్పీల్‌ దాఖలు చేసే వ్యక్తులు ఆయా నియమ నిబంధనలను సరిగ్గా తెలుసుకుని ఉండాలి. వీటికి సంబంధించి కొన్ని ముఖ్య నియమ నిబంధనలు ఉన్నాయి.

మొదటిది.. అప్పీల్‌ దాఖలు చేయటమనేది నిర్ణీత గడువులోపు జరగాలి. తాను ఏ ఆర్డర్‌ లేదా నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ దాఖలు చేస్తున్నాడో ఆ ఆర్డర్‌ లేదా నిర్ణయం తనకు అందిన దగ్గర నుంచి మూడు నెలల లోపు సంబంధిత అప్పిలేట్‌ అథారిటీ వద్ద దాఖలు చేయాలి. ఏదేనీ అనివార్య కారణాలతో మూడు నెలల లోపు దాఖలు చేయలేకపోతే తగు కారణాలు చూపటం ద్వారా అప్పిలేట్‌ అథారిటీ నుంచి అదనంగా ఒక నెల గడువు పొందవచ్చు. అయితే కారణాలు సహేతుకంగా అనిపించకపోతే ఈ అభ్యర్ధనను తిరస్కరించే అధికారం అప్పిలేట్‌ అథారిటీకి ఉంటుంది.

మరొక ముఖ్యమైన విషయం ప్రీ డిపాజిట్‌ చెల్లించటం. దీనికోసం ముందుగా ఏ ఆర్డర్‌ మీద అప్పీల్‌ చేస్తున్నాడో, ఆ ఆర్డర్‌కు సంబంధించి తాను ఆమోదించే విషయాలు అంటే అడ్మిట్‌ చేసే విషయాలు, విభేదించే విషయాలు అంటే డిస్ప్యూట్‌ చేసే విషయాలు విడివిడిగా చూపాలి. తాను అడ్మిట్‌ చేసే వాటికి సంబంధించిన మొత్తం అంటే పన్ను, వడ్డీ, పెనాల్టీ మొదలైనవి మొత్తంగా చెల్లించాలి. విభేదించే వాటిలో పన్ను మీద మాత్రం 10 శాతం చెల్లించాలి. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.

ఒక వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా ఒక ఆర్డర్‌ ఇవ్వటం జరిగింది. ఇందులో ఒక రూ.లక్ష ట్యాక్స్‌, మరొక రూ.లక్ష పెనాల్టీతో పాటుగా వడ్డీ కూడా డిమాండ్‌ చేయటం జరిగిందనుకుందాం. ఇందులో రూ.40,000కు సంబంధించి ట్యాక్స్‌ దానికి సంబంధించిన పెనాల్టీ, వడ్డీకి సంబంధించి తాను ఆమోదిస్తున్నాడు. మిగతా రూ.60,000కు సంబంధించిన ట్యాక్స్‌, పెనాల్టీ, వడ్డీ మీద తాను అప్పీల్‌ చేస్తున్నాడనుకుంటే.. ముందుగా తాను ఆమోదించే మొత్తాన్ని ట్యాక్స్‌, పెనాల్టీ, వడ్డీతో సహా చెల్లించటంతో పాటుగా తాను అప్పీల్‌ చేసుకునే రూ.60,000 లలో 10 శాతం అంటే రూ.6,000 ప్రీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇక్కడ చాలా మంది పొరపాటు పడే అంశం ఏమిటంటే డిస్ప్యూట్‌ చేసే పన్నులో 10 శాతం కడితే ప్రీ డిపాజిట్‌ కింద సరిపోతుందనుకుంటారు. కానీ, ఆ మొత్తంతో పాటుగా తాము అడ్మిట్‌ చేసే అంశాల మొత్తాన్ని చెల్లించాలనే విషయాన్ని విస్మరిస్తుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రీ డిపాజిట్‌గా చెల్లించే 10 శాతం తాను ఆమోదించని అంశాల్లో కేవలం పన్ను మీద చెల్లిస్తే సరిపోతుంది. అదే ఆమోదించే అంశాలకు సంబంధించి మాత్రం మొత్తం చెల్లించాలి. అందుకే అప్పీల్‌ కోసం వాడే నిర్ణీత ఫారమ్‌ (జీఎ్‌సటీ ఏపీఎల్‌ 01)లో మొత్తం ఆర్డర్‌కు సంబంధించిన పన్ను, వడ్డీ, పెనాల్టీ, ఫైన్‌ మొదలగు వివరాలతో పాటుగా వీటిలో అడ్మిట్‌ చేసే అంశాలు, డిస్ప్యూట్‌ చేసే అంశాలు వివరంగా చూపి తగు మొత్తాలను విధిగా చెల్లించాలి.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - Mar 03 , 2024 | 01:54 AM