Share News

‘ఎన్నికల’పై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:01 AM

‘ఎన్నికల’పై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలు

‘ఎన్నికల’పై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలు

రూ.5-10 ప్యాకెట్లకు పెరగనున్న డిమాండ్‌

ఉత్పత్తి, పంపిణీ

పెంచుతున్న కంపెనీలు

న్యూఢిల్లీ: కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతోంది. ఇందుకు అవసరమైన ఖర్చుల కోసం రాజకీయ పార్టీలు, పోటీపడే అభ్యర్ధులు ఇప్పటికే సిద్ధమయ్యారు. వీరి ప్రచార సభలు, ర్యాలీలకు వచ్చే జనానికి మంచినీళ్ల ప్యాకెట్లు, చిన్నచిన్న బిస్కెట్‌ ప్యాకెట్లు, శీతల పానీయాల వంటి చిరుతిళ్లు, కానుకలు పంచేందుకు పార్టీలు సిద్ధమై పోయాయి. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలూ సిద్ధమయ్యాయి. రూ.5 లేదా రూ.10 ధర ఉండే చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిళ్లతో సిద్ధమవుతున్నాయి.

ఉత్పత్తి పెంపు: సాధారణ రోజుల్లో రూ.5 లేదా రూ.10 ప్యాకెట్లకు పెద్దగా డిమాండ్‌ ఉండదు. ఎన్నికల సమయంలోనే వీటికి డిమాండ్‌. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఈ చిన్న ప్యాకెట్లు, బాటిళ్లకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఇది మరింత పెరగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ ప్యాకెట్ల ఉత్పత్తి, పంపిణీ 10 శాతం వరకు పెంచేశాయి. కంపెనీల సేల్స్‌ రిప్రజెంటేటివ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున పర్యటిస్తూ కిరాణా షాపుల్లో వీటి కొరత లేకుండా స్టాకులు పెంచుతున్నారు.‘ర్యాలీలు ఎక్కువగా జరిగే హిందీ రాష్ట్రాల్లో చిన్న ప్యాకెట్లలో లభించే బిస్కెట్లు, స్నాక్స్‌కు ఇప్పటికే గిరాకీ పెరిగింది. దీంతో మామూలు రోజుల కంటే ఎన్నికల సమయంలో ఈ చిన్న ప్యాకెట్ల నిల్వలను 8 నుంచి 10 శాతం వరకు పెంచబోతున్నాం’ అని ఒక కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. చిన్న చిన్న ప్యాకెట్లలో హెయిర్‌ ఆయిల్‌, షాంపూలు, పానీయాలు అమ్మే కంపెనీలదీ ఇదే పరిస్థితి.

Updated Date - Mar 09 , 2024 | 03:01 AM