Share News

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభంలో 126% వృద్ధి

ABN , Publish Date - May 30 , 2024 | 02:20 AM

హెరిటేజ్‌ ఫుడ్స్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను...

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభంలో 126% వృద్ధి

క్యూ4 లాభం రూ.40 కోట్లుగా నమోదు

ఒక్కో షేరుకు 50% డివిడెండ్‌ సిఫారసు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ రూ.950.60 కోట్ల రెవెన్యూపై రూ.40.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే త్రైమాసికంతో పోల్చితే రెవెన్యూ 16.3 శాతం పెరగగా లాభం 126.3 శాతం వృద్ధి చెందింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.3,793.90 కోట్ల రెవెన్యూపై రూ.106.50 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ 17.1 శాతం, లాభం 83.6 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో పాల విక్రయాలు 3.74 శాతం వృద్ధి చెందగా పాల సేకరణ రోజుకు 15.9 లక్షల లీటర్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో వాల్యూ యాడెడ్‌ (విలువ ఆధారిత) ఉత్పత్తులు విక్రయాలు 21.82 శాతం వృద్ధి చెందగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి 18.67 శాతం పెరిగినట్లు తెలిపింది.


ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.50 (50 శాతం) తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యలతో 2023-24 మార్చి త్రైమాసికంతో పాటు మొత్తం ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన పనితీరును కనబరచగలిగినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు.

Updated Date - May 30 , 2024 | 02:20 AM