లాభాల హ్యాట్రిక్
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:59 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 597.67 పాయింట్ల వృద్ధితో 80,845.75 వద్దకు చేరుకుంది....
మూడో రోజూ మార్కెట్ ముందుకే..
సెన్సెక్స్ మరో 597 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 597.67 పాయింట్ల వృద్ధితో 80,845.75 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 181.10 పాయింట్లు బలపడి 24,457.15 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ సహా పలు బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు పెంచడం సూచీల ర్యాలీకి దోహదపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 25 రాణించాయి. అదానీ పోర్ట్స్ షేరు 6 శాతానికి పైగా పెరిగి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2 శాతానికి పైగా పుంజుకోగా.. ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేర్లు ఒక శాతానికి పైగా వృద్ధి చెందాయి.
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై జీఎ్‌సటీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని మంత్రుల బృందం ప్రతిపాదించిన నేపథ్యంలో ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వరుణ్ బెవరేజెస్ నష్టాలు చవిచూశాయి. ఇంట్రాడేలో 3 శాతం క్షీణించిన ఐటీసీ షేరు చివరికి 1.02 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. వరుణ్ బెవరేజెస్ 1.86 శాతం తగ్గింది.
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్@ : రూ.14 లక్షల కోట్లు
ప్రైవేట్ రంగ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేరు ఒక దశలో దాదాపు 2 శాతం పెరిగి రూ.1,837 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ.14 లక్షల కోట్ల స్థాయికి చేరింది. చివరికి బ్యాంక్ షేరు 1.24 శాతం లాభంతో రూ.1,826.85 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.13.96 లక్షల కోట్ల స్థాయి వద్ద స్థిరపడింది.
గ్రాన్యూల్స్ షేరు ఢమాల్
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ లిమిటెడ్ షేరు బీఎ్‌సఈలో 10.12 శాతం క్షీణించి రూ.534.45 వద్దకు జారుకుంది. తెలంగాణలోని గాగిల్లాపూర్‌లో ఉన్న యూనిట్‌లో తనిఖీలు జరిపిన యూఎ్‌సఎఫ్‌డీఏ ఆరు లోపాలను గుర్తించినట్లు కంపెనీ వెల్లడించడం ఇందుకు కారణమైంది. ఎందుకంటే, కంపెనీకి మెజారిటీ ఆదాయం ఈ యూనిట్‌లో తయారయ్యే ఔషధాల ద్వారానే సమకూరుతోంది.