బంగారం భగ భగ
ABN , Publish Date - Mar 08 , 2024 | 02:49 AM
ఈ వేసవిలో భానుడితోపాటు బంగారమూ భగ్గుమంటోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రేటు గురువారం రూ.500 పెరిగి రూ.65,650కి ఎగబాకింది...
మరో రూ.500 పెరిగిన ధర
తులం రూ.65,650కి చేరిక
ఈ వేసవిలో భానుడితోపాటు బంగారమూ భగ్గుమంటోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రేటు గురువారం రూ.500 పెరిగి రూ.65,650కి ఎగబాకింది. దేశీయంగా బంగారం ధరల్లో సరికొత్త రికార్డు స్థాయిది. వెండి కూడా పరుగు తీస్తోంది. కిలో ధర రూ.400 పెరుగుదలతో రూ.74,900కు చేరుకుంది. అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 2,161 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ 24.10 డాలర్ల వద్ద ట్రేడైంది. ఈ ఏడాదిలో ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అమెరికన్ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జిరోమ్ పావెల్ సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బాండ్ల నుంచి క్రమంగా విలువైన లోహాల్లోకి మళ్లిస్తుండటం ప్రస్తుత బులియన్ ర్యాలీకి ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులతోపాటు సెంట్రల్ బ్యాంక్‌లు బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతుండటం కూడా గోల్డ్ డిమాండ్ పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ విశ్లేషకులు అన్నారు. బంగారం ధరలు మున్ముందు మరింత ర్యాలీ తీయవచ్చని.. ఈ ఏడాది చివరినాటికి తులం రూ.72,000కు చేరుకోవచ్చని కొందరు భావిస్తున్నారు.
నేడు మార్కెట్లకు సెలవు
మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు శుక్రవారం సెలవు. బులి యన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. సోమ వారం నుంచి మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.