Share News

మధ్యంతర బడ్జెట్‌పై గంపెడాశలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 06:08 AM

‘వచ్చేది మధ్యంతర బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఏమీ ఉండవు. కాబట్టి పెద్దగా ఆశలు పెట్టుకోకండి’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. అయినా కార్పొరేట్‌ రంగం...

మధ్యంతర బడ్జెట్‌పై గంపెడాశలు

వృద్ధికే పెద్ద పీట వేయాలని ఇండియా ఇంక్‌ విజ్ఞప్తి

‘వచ్చేది మధ్యంతర బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఏమీ ఉండవు. కాబట్టి పెద్దగా ఆశలు పెట్టుకోకండి’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ప్రకటించారు. అయినా కార్పొరేట్‌ రంగం ఈ బడ్జెట్‌పైనా గంపెడాశలు పెట్టుకుంది. జీడీపీ వృద్ధి రేటును మరింత పరుగులు పెట్టించేందుకు పన్ను రాయితీలతో పాటు దేశీయ తయారీకి ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని నిధులు, మరిన్ని సామాజిక సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరుతోంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ‘మధ్యంతర’ బడ్జెట్‌లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి కొన్ని చర్యలు తీసుకోకతప్పదని పారిశ్రామిక వర్గాల వాదన. పెట్టుబడులకు పెద్దపీట వేస్తూనే ద్రవ్య లోటు అదుపు తప్పకుండా చూడడం ఆర్థిక మంత్రి ముందున్న అతి పెద్ద సవాల్‌ అని పేర్కొన్నాయి.

సుంకాల పోటు తగ్గించండి

భారత్‌లో తయారీ అని ఎంతగా మొత్తుకుంటున్నా, మన దేశంలో వైద్య పరీక్షల కోసం ఉపయోగించే పరికరాల్లో ఇప్పటికీ 60 శాతం దిగుమతులే శరణ్యం. ఈ దిగుమతులపై విధిస్తున్న సుంకాలతో వాటి దిగుమతి ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. దేశీయ ఉత్పత్తి ఒక స్థాయికి చేరేవరకైనా ఈ సుంకాలను సముచిత స్థాయికి తగ్గించాలని మెడికల్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంటాల్‌) చైర్మన్‌ పవన్‌ చౌదరి ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరారు. లేకపోతే సామాన్యుడికి సైతం చౌకగా వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వంటి ప్రభుత్వ పథకాలు నీరుగారి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు..

కాగా ఈసారి బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు, దీర్ఘకాలిక పన్ను విధానంతో పాటు వినియోగం, పొదుపు పెంచేందుకు చర్యలను ప్రకటించవచ్చని విశ్లేషకుల అంచనా. అంతేకాదు, కార్పొరేట్‌ కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్‌ (ఎల్‌ఎల్‌పీ)పై సమానంగా పన్ను విధించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని రంగాలకు పీఎల్‌ఐ

దేశంలో అధునాత తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక జాతీయ మిషన్‌ ఏర్పాటు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తన బడ్జెట్‌ కోరికల చిట్టాలో ప్రభుత్వాన్ని కోరింది. దీనికి తోడు దేశంలో భారీ ఉపాధి అవకాశాలకు దోహదం చేసే దుస్తులు, ఆటబోమ్మలు, పాదరక్షల తయారీ రంగాలకూ పీఎల్‌ఐ పథకం విస్తరించాలని విజ్ఞప్తి చేసింది. ఉత్పాదక వస్తువులు, రసాయనాల దిగుమతులను తగ్గించే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరింది. మరో పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమాఖ్య ఫిక్కీ మాత్రం వచ్చే మధ్యంతర బడ్జెట్‌లో భౌతిక, సామాజిక, డిజిటల్‌ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ పెట్టుబడులు మరింత పెంచాలని కోరింది.

Updated Date - Jan 28 , 2024 | 06:08 AM